అంబేద్కర్ వాదులుగా ఆదర్శంగా ఉండాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్ వాదులుగా ఆదర్శంగా ఉండాలి :  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • ఆయన స్ఫూర్తితో చదవండి: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • యాదాద్రి జిల్లా రేణికుంటలో అంబేద్కర్​ విగ్రహావిష్కరణ

రాజాపేట, వెలుగు: ప్రతిఒక్కరూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని, అంబేద్కర్ వాదులుగా పది మందికి ఆదర్శంగా నిలవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం యాదాద్రి జిల్లా రాజాపేట మండలం రేణికుంట గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లతో ఎదిగిన వారు మరో పది మందిని పైకి తీసుకురావాలని సూచించారు. ప్రతి గ్రామం నడిబొడ్డున అంబేద్కర్​విగ్రహం ఉంటే పిల్లలకు,యువతకు ఆయనలాగే చదువుకొని ఎదగాలనే స్ఫూర్తి కలుగుతుందన్నారు. విద్య జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని.. వాటితో ఏదైనా సాధించవచ్చన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో కాకా వెంకటస్వామి అంబేద్కర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారన్నారు. 

అంబేద్కర్ విద్యాసంస్థల ద్వారా లక్షల మందికి విద్యనందిస్తున్నామన్నారు. కాకా స్ఫూర్తితో 120 కి పైగా అంబేద్కర్ విగ్రహాలను డొనేట్ చేశానన్నారు. తెలంగాణలో ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకున్న రూ.50 వేల సాయం చేస్తానన్నారు. మహిళల, కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ చట్టం చేశారన్నారు. దేశ ప్రజలకు ఓటు హక్కు కల్పించడం వంటి అనేక సంస్కరణలను రాజ్యాంగం ద్వారా అందించిన ఘనత అంబేద్కర్ ది అన్నారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందన్నారు.