కార్ల్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌కు కప్పు..ప్రజ్ఞాకు పేరు

కార్ల్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌కు కప్పు..ప్రజ్ఞాకు పేరు
  • చెస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌ మాగ్నస్
  • ఫైనల్లో పోరాడి ఓడి రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన 18 ఏండ్ల ప్రజ్ఞానంద

బాకు:ప్రతిష్టాత్మక ఫిడే చెస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచి చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద కొద్దిలో చేజార్చుకున్నాడు. పలువురు మేటి ప్లేయర్లను మట్టికరిపిస్తూ ముందుకొచ్చి.. ఫైనల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ మాగ్నస్‌‌‌‌‌‌‌‌ కార్ల్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌కు సవాల్‌‌‌‌‌‌‌‌ విసిరిన 18 ఏండ్ల  ప్రజ్ఞా టై బ్రేక్స్‌‌‌‌‌‌‌‌లో తడబడ్డాడు. అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో గురువారం జరిగిన ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌ టై బ్రేక్స్‌‌‌‌‌‌‌‌లో 1.5–0.5 తేడాతో ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ను ఓడించిన నార్వే లెజెండ్​ కార్ల్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలుచుకున్నాడు. తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో ప్రజ్ఞానంద విసిరిన సవాల్‌‌‌‌‌‌‌‌ను తట్టుకొని నిలబడ్డ మాగ్నస్‌‌‌‌‌‌‌‌ చివర్లో తన మాస్టర్‌‌‌‌‌‌‌‌ మైండ్‌‌‌‌‌‌‌‌ చూపెట్టి 45 ఎత్తుల్లో గెలిచాడు. రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో సేఫ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌ ఆడిన ఐదుసార్లు వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ 22 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. ఫలితంగా వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ప్రజ్ఞానంద రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు రెండు క్లాసికల్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఐదుసార్లు వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన మాగ్నస్‌‌‌‌‌‌‌‌ తొలిసారి వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకున్నాడు. మరోవైపు విశ్వనాథన్​ ఆనంద్​ తర్వాత  ఈ టోర్నీలో ఫైనల్ ఆడిన ఇండియన్​గా నిలిచిన ప్రజ్ఞా  వరల్డ్‌‌‌‌‌‌‌‌ నం.2 హికారు నకమురా, నం.3 ఫాబియానో కరువానాను ఓడించి మంచి పేరు తెచ్చుకున్నాడు. 

ఆనంద్​ బాటలో..

వరల్డ్​ కప్​లో అద్భుత ఆటతో వరల్డ్​ చెస్​లో ప్రజ్ఞానంద పేరు మార్మోగుతోంది. ఇలాంటి సంచలనాలు అతనికి కొత్తేం కాదు. ఇండియన్​ చెస్​కు హాట్​స్పాట్​ సిటీ అయిన చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద చిన్న వయసులోనే వండర్​ కిడ్​గా పేరు తెచ్చుకున్నాడు. నాలుగున్నర ఏండ్ల వయసులో తన అక్క, విమెన్​ గ్రాండ్​ మాస్టర్​ వైశాలితో సరదాగా చెస్​ బోర్డుపై పావులు కదిపిన ప్రజ్ఞా తక్కువకాలంలోనే ఆటను ఔపోసన పట్టేశాడు. నేషనల్ అండర్​7 టైటిల్​ నెగ్గి ఇండియన్​ చెస్​లో తన రాకను ఘనంగా చాటుకున్న ఈ బుడ్డోడు పదేండ్లకే  ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించాడు. ఇంకో రెండేండ్లకే  గ్రాండ్​ మాస్టర్​ అయి ఈ ఘనత సాధించిన యంగెస్ట్​ ఇండియన్​గా రికార్డు సృష్టించాడు.  అదే జోరుతో పలువురు అగ్ర ప్లేయర్లను ఓడిస్తూ వచ్చిన ఈకుర్రాడు.. 2022లో  కార్ల్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌ను ఓడించి ఒక్కసారిగా వరల్డ్​ చెస్​ దృష్టిని ఆకర్షించాడు.  ఆనంద్, హరికృష్ణ తర్వాత మాగ్నస్​పై గెలిచిన మూడో ఇండియన్​గా నిలిచిన ప్రజ్ఞానంద ఇక వెనుదిరిగి చూసింది లేదు.  మొదట్లో ఆర్​బీ రమేశ్​ శిక్షణలో రాటు దేలిన ప్రజ్క్షా.. విశ్వనాథన్​ ఆనంద్​ మెంటార్​గా వచ్చిన తర్వాత  తన ఆటను ఇంకో మెట్టు ఎక్కించాడు.  ఫలితంగా మరో రెండు సార్లు  మాగ్నస్‌‌‌‌‌‌‌‌ను ఓడించిన ప్రజ్ఞా  పోటీ పడ్డ తొలి వరల్డ్​కప్​లోనే రన్నరప్​గా నిలిచాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటం, ఎదురుగా ఎంత పెద్ద ప్లేయర్​ ఉన్నా బెదరకపోవడం, తన టాలెంట్​పై అపారమైన నమ్మకం ఉంచడం.. ఆఖరి ఎత్తు వరకూ పోరాటాన్ని వదలకపోవడం ప్రజ్ఞానంద బలాలు. అతను వరల్డ్​ కప్​ నెగ్గకపోయినా అద్భుత ఆటతో ఈ టోర్నీ జరిగినన్ని రోజులు జాతీయ పత్రికల్లో ప్రధాన పేజీలో కనిపించాడు. కొన్ని రాష్ట్రాల్లోనే  పాపులర్​ అయిన చెస్​కు దేశమంతటా గుర్తింపు తెచ్చిపెట్టాడు. 

ఆనంద్ మాదిరిగా ప్రజ్ఞాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అక్క నుంచి ఆట నేర్చుకోగా.. ఏ దేశంలో టోర్నీ జరిగినా వెంట వచ్చి కావాల్సినవన్నీ చూసుకునే తల్లి నాగలక్ష్మి అతనికి అతి పెద్ద బలం. తాజా వరల్డ్​కప్​ పెర్ఫామెన్స్​ ప్రజ్ఞానందను బాల మేధావి నుంచి మేటి ఆటగాళ్లలో ఒకడిగా నిలిపింది.  ఈ టోర్నీలో ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరడం ద్వారా  కెనడాలో జరిగే 2024 క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీకి కూడా క్వాలిఫై అయ్యాడు. లెజెండ్‌‌‌‌‌‌‌‌ బాబీ ఫిషర్, కార్ల్‌‌‌‌‌‌‌‌సన్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌ బెర్తు సాధించిన థర్డ్‌‌‌‌‌‌‌‌ యంగెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. క్లాసికల్ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో ఇంకా మెరుగవ్వాల్సినప్పటికీ ఇదే జోరు కొనసాగిస్తే అతను ఆనంద్ స్థాయిని అందుకోవడం ఖాయం. 

ఇది చిన్న ఘనత కాదు

ఫిడే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా ఆడిన ప్రజ్ఞానందను చూసి మేమంతా గర్విస్తున్నాం. ఈ టోర్నీలో తను అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించాడు.  ఫైనల్లో బలమైన  మాగ్నస్ కార్ల్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఇది చిన్న ఘనత కాదు.  రాబోయే టోర్నమెంట్లలో  ప్రజ్ఞా బాగా ఆడాలని ఆశిస్తున్నా ప్రధాని నరేంద్ర  మోదీ

అందరి మనసులు గెలిచాడు

18 ఏండ్ల  గ్రాండ్‌‌‌‌‌‌‌‌మాస్టర్ ప్రజ్ఞానంద ఫిడే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలవడం ద్వారా ప్రతి భారతీయుడి మనసును గెలుచుకున్నాడు. ఈ ఆటలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిని ఎదుర్కొంటూ గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతనికి  నా హృదయపూర్వక అభినందనలు.  భవిష్యత్తులో అతను మరింత కీర్తిని సాధించాలని కోరుకుంటున్నా.  
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- (వెలుగు స్పోర్ట్స్​ డెస్క్​)