Pakisthan: చికెన్ కొనలేం..టీ తాగలేం

Pakisthan: చికెన్ కొనలేం..టీ తాగలేం

పాకిస్థాన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అక్కడ ఏది కొనాలన్నా తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే  కరాచీలో మొన్నటివరకూ చికెన్ ధర కిలో రూ.490 ఉండగా.. తాజాగా అది రూ.720కి చేరుకుంది. రావల్పిండి, ఇస్లామాబాద్ లాంటి కొన్ని నగరాల్లోనూ చికెన్ ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. కిలో కోడి మాంసం 700-705 రూపాయలకు అమ్ముడవుతోంది. కాగా  దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో నగరమైన లాహోర్‌లోనూ కోడి మాంసం కిలో ధర రూ.550-600 మధ్య పలుకుతోంది. అయితే అక్కడ అంతగా చికెన్ ధరలు పెరగడానికి కారణం ఆర్థిక సంక్షోభంతో పాటు ఫీడ్ కొరత కారణంగా అనేక పౌల్ట్రీ వ్యాపారాలు మూసివేయడమేనని తెలుస్తోంది. రోజురోజుకూ అమాంతం పెరిగిపోతున్న ఈ ధరలు చూసి చికెన్ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడి ప్రభుత్వం పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం లేకుండా,.. ప్రజలకు ఉపశమనం కలిగించే మార్గాలను అన్వేషిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పౌల్ట్రీ పరిశ్రమ కూడా ఓ ముఖ్య వనరుగా ఉంది. అయితే ప్రస్తుతం ధరలు పెరగడంతో ఆ దేశ ఆర్థిక స్థిరత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.

చికెన్ సంగతి పక్కన పెడితే.. పాకిస్తాన్ లో బ్లాక్ టీ పొడి ధర గత 15 రోజుల్లోనే కిలో రూ.1100 నుంచి రూ.1600 పెరిగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒక ప్రముఖ బ్రాండ్ 170 గ్రాముల గ్రాన్యులేటెడ్, ఏలకుల ప్యాక్ ధరను రూ.290 నుండి రూ.320, రూ.350కి పెంచినట్లు ఓ రిటైలర్ తెలిపారు. 900, 420 గ్రాముల ప్యాక్‌ల ధర ఇప్పుడు రూ. 1350 గా చేశారు. ఇతర వ్యాపారస్థులు కూడా ధరలను పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. దిగుమతులు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాయని, మార్చిలో ఈ పరిస్థితి మరింత పెరగొచ్చని ఫెడరేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FPCCI) స్టాండింగ్ కమిటీ కన్వీనర్ జీషన్ మక్సూద్ తెలిపారు.