కిలో చికెన్ 340..ఆల్​టైం రికార్డు స్థాయికి రేట్లు.. వారంలో రూ.40 పెరిగిన ధర

కిలో చికెన్ 340..ఆల్​టైం రికార్డు స్థాయికి రేట్లు.. వారంలో రూ.40 పెరిగిన ధర

 

  • కిలో చికెన్ 340..ఆల్​టైం రికార్డు స్థాయికి రేట్లు
  • ఎండలు ముదరడంతో కోళ్ల షార్టేజీ
  • వారంలో రూ.40 పెరిగిన ధర
  • మరికొన్ని రోజులు రేట్లు ఇట్లనే..
  • జులై మొదటి వారం నుంచి తగ్గే చాన్స్​

మహబూబ్​నగర్, వెలుగు:  చికెన్ రేటు కొండెక్కింది. ఎండల కారణంగా కొద్దిరోజులుగా పెరుగుతున్న ధరలు.. ఆదివారం ఆల్​టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ ధర కిలోకు రూ.320 నుంచి రూ.340 దాకా పలికింది. గ్రామీణ ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌లోని అనేక చోట్ల ఆదివారం కిలో స్కిన్​లెస్‌కు రూ.340 దాకా తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ రేటే అత్యధికమని వ్యాపారులు, వినియోగదారులు అంటున్నారు. సండే రోజున చికెన్ షాపులకు వెళ్లిన పలువురు రేట్లను చూసి అవాక్కయ్యారు. కిలో కొనేవారు అర కిలోకే పరిమితమయ్యారు. మరో కొద్దిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, జులై మొదటి వారం నుంచి రేట్లు తగ్గుముఖం పడుతాయని వ్యాపారులు చెప్తున్నారు.

ఎండల భయంతో ఉత్పత్తి పెంచలే

ఈనెల 1 నుంచి 3 వరకు హోల్​సేల్ కోడి ధర కిలోకు రూ.146 ఉండగా, చికెన్ రూ.260 నుంచి 270 దాకా పలికింది. 4వ తేదీ నుంచి రేట్లు క్రమంగా పెరిగి 8న హోల్​సేల్ రేట్ కోడి ధర కిలోకు రూ.167కి, చికెన్ రేటు రూ.300కు పెరిగింది. ఆదివారం హోల్​సేల్ రేట్ రూ.173 కు చేరడంతో అన్నిచోట్లా చికెన్ రిటైల్ మార్కెట్‌లో కిలోకు రూ.320 నుంచి 340 దాకా అమ్మారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే రేట్లు తీసుకున్నారు. పల్లెల్లో కూడా రూ.340 దాకా వసూలు చేశారు. హైదరాబాద్​లోని అనేక చోట్ల ఇదే రేటు పలికింది. ఏటా సమ్మర్‌‌లో ఎండల తీవ్రత వల్ల కోళ్లు ఎక్కువగా చనిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటాయి.

మే చివరి వారంలో కంపెనీలు రైతులకు కోళ్లను ఇచ్చి, జూన్​లో ఉత్పత్తిని పెంచుకుంటాయి. దీంతో డిమాండ్​కు తగ్గ ఉత్పత్తి జరిగేది. కానీ ఈసారి మేలో అకాల వర్షాలు పడ్డాయి. చివరి వారం నుంచి ఎండలు దంచాయి. దీని ప్రభావంతో జూన్ మొదటి వారంలో కూడా ఎండలు 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. దీంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకానికి ముందుకు రాలేదు. కోళ్ల షార్టేజ్ ఏర్పడి రేట్లు విపరీతంగా పెరిగాయి. అందుకే వారం రోజుల్లోనే కిలో మీద రూ.40 దాకా పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ధరలు ఇంకా పెరిగే చాన్స్ ఉందని చెప్తున్నారు. జులై మొదటి వారం నుంచి రేట్లు తగ్గుతాయని, అప్పటికి రూ.250 నుంచి రూ.280 మధ్య చికెన్​ధర ఉండొచ్చని వ్యాపారులు చెప్తున్నారు. శ్రావణ మాసం ఎఫెక్ట్​తో ఆగస్టులో రేట్లు రూ.200కు దిగిరావచ్చని అంటున్నారు.

ఎండలకు బతుకుతలేవు

నాకు కోళ్ల ఫారం ఉంది. కోళ్లను పెంచి ఇచ్చినందుకు ఒక్కో కోడి బరువును బట్టి రూ.8 నుంచి రూ.15 వరకు కంపెనీలు చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు 44 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. దీంతో కోళ్లు బతుకుతలేవు. మాకు లాస్ వస్తుంది. కంపెనీలు కూడా ఉత్పత్తి తగ్గించినయ్.
‑ ప్రసాద్​, పౌల్ట్రీ రైతు, దుప్పల్లి

గుడ్లతో సరిపెట్టుకున్నం

మా ఇంట్లో ప్రతి సండే చికెన్ తప్పనిసరి. పోయిన ఆదివారం కిలో చికెన్ రూ.240 ఉండే. ఈ పొద్దు కూడా చికెన్ కోసం షాపుకు వెళ్లిన. కానీ కిలో రూ.330 అన్ని చెప్పిన్రు. దీంతో చికెన్ తెచ్చుకోలే. డజన్ గుడ్లను తెచ్చుకొని పులుసు పెట్టుకొని తిన్నం.
‑ వినోద్ గౌడ్, బండమీదిపల్లి,  మహబూబ్​నగర్