తమిళనాడులో 6.5 లక్షల మైగ్రెంట్ ఓటర్లు: చిదంబరం

తమిళనాడులో 6.5 లక్షల మైగ్రెంట్ ఓటర్లు: చిదంబరం
  • బిహార్ కు చెందినోళ్లను ఇక్కడెలా ఓటర్ల జాబితాలో చేరుస్తారు?

న్యూఢిల్లీ: తమిళనాడులో 6.5 లక్షల వలసదారుల(మైగ్రెంట్)ను ఓటర్ల జాబితాలో చేర్చారని కాంగ్రెస్  లీడర్  పి.చిదంబరం అన్నారు. ఇది ఆందోళనకర పరిణామమని ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు. బిహార్ లో చేపడుతున్న స్పెషల్  ఇంటెన్సివ్  రివిజన్ (సర్) పైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్ లో ఎన్నికల అధికారులు తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 65 లక్షల మంది ఓటర్లను తొలగించాలని ఈసీ నిర్ణయించిందని, దీంతో ఆ ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోయే ప్రమాదంలో పడ్డారని ఆరోపించారు. 

అంతేకాకుండా ఓటర్ల జాబితాలో 36 లక్షల మంది ఓటర్ల పేర్లు కనిపించకుండా పోయాయన్నారు. ‘‘తాజాగా తమిళనాడులో 6.5 లక్షల మంది మైగ్రెంట్  ఓటర్లను ఓటర్ల జాబితాలో కలిపారు. అంటే బిహార్ లో మిస్సింగ్  అయిన వారి పేర్లు ఇక్కడ కలిపారా? ఆ 6.5 లక్షల  మంది ఓటర్లను శాశ్వత ఓటర్లుగా అధికారులు పేర్కొంటున్నారు. 

మైగ్రెంట్  వర్కర్లు వారి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎందుకు వెళ్లకూడదు? ఎందుకంటే, ఒక వ్యక్తిని ఓటరుగా ఎన్ రోల్  చేయాలంటే అతనికి శాశ్వతమైన, చట్టబద్ధమైన నివాసం ఉండాలి. తమిళనాడుకు వలసవచ్చిన వారు బిహార్  ఓటర్లు. వారికి బిహార్ లోనే శాశ్వత నివాసం ఉంది. అటువంటపుడు తమిళనాడులో వారిని ఓటర్లుగా ఎలా ఎన్ రోల్  చేస్తారు?” అని చిదంబరం పేర్కొన్నారు.