ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీలో 26 మంది అభ్యర్థులు

ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీలో 26 మంది అభ్యర్థులు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకు నోటిఫికేషన్‌ రాగా.. ఆరు చోట్ల ఏకగ్రీవమైపోయాయి. మిగిలిన ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. ఆయా జిల్లాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీలు.. ఎమ్మెల్సీ పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ ఎన్నికలకు సంబంధించి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ మీడియాతో మాట్లాడారు. క్యాంపు రాజకీయాలు, ప్రలోభాలకు ఎవరూ లొంగకూడదన్నారు. కరోనా గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలన్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ గొడవకు సంబంధించి ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై కేంద్రం ఎన్నికల సంఘానికి రిపోర్ట్ ఇచ్చామని చెప్పారు. ఏకగ్రీవమైన ఎమ్మెల్సీ స్థానాలలో ఎన్నికల కోడ్ ఉంచాలా వద్దా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 

ఆరు స్థానాలకు పోటీలో 26 మంది అభ్యర్థులు

ఆదిలాబాద్‌లో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారని, ఇక్కడ పోలింగ్ కోసం 8 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని శశాంక్ గోయల్ తెలిపారు. ఇక్కడ మొత్తం 937 మంది ఓటర్లు ఉన్నారన్నారు. కరీంనగర్‌‌లో రెండు స్థానాలకు పది మంది బరిలో ఉండగా.. ఎనిమిది పోలింగ్ స్టేషన్లలో 1,324 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పారు. మెదక్‌లో ఒక్క స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారని, ఇక్కడ 1,026 మంది ఓటర్లు ఉన్నారని శశాంక్ అన్నారు. నల్లగొండలో ఒక్క స్థానానికి ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 1,271 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఖమ్మంలో  ఒక్క స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉండగా.. 768 మంది ఓట్లు వేస్తారని చెప్పారు.