సీఎంలకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు

సీఎంలకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు

న్యూఢిల్లీ: బీజేపీ వ్యతిరేక పోరాటంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి రావడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. జగన్‌కు, కేసీఆర్‌కు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఢిల్లీలో ప్రారంభమైన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో తమ్మినేని పైవ్యాఖ్యలు చేశారు. బీజేపీ విధానలను వ్యతిరేకిస్తే కేంద్ర కక్ష సాధిస్తుందేమోనని భయపడుతున్నారని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల సీఎంలపై కేసులు, వ్యక్తిగత తప్పులు ఉన్నాయని.. అందుకే వాళ్లు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతూ మౌనాన్ని పాటిస్తున్నారని విమర్శించారు. సాగు చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్.. ఇప్పుడు పిరికితనం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. 

సమస్యలను పక్కదారి పట్టించడానికే తిట్ల దండకాలు

‘ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఏపీలో అక్టోబర్ 25న నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాం. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ధరలు, నిరుద్యోగం పెరిగి ప్రజలు కష్టాల్లో ఉంటే అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుని ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి సరికాదు. ఇది ఖండించాల్సిన విషయం. బాధ్యతా రహితంగా వ్యక్తిగత దూషణలు చేయడం కూడా సరికాదు. దూషణలు, దాడులు రాష్ట్ర సమస్యలు పక్కదారి పట్టించడానికే.. తిట్ల మీద పోరాటాలు ప్రజలకు ఉపయోగపడవు. ప్రజా సమస్యలపై పోరాటాలు జనాలకు ఉపయోగపడతాయి’ అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు మధు అన్నారు. 

కాగా, శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కరోనా పరిస్థితుల తర్వాత తొలిసారి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వీటిని నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ఈ సమావేశాల్లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చర్చిస్తారు. ఈ కమిటీ సమావేశాలకు ఏపీ, తెలంగాణ నుంచి రాష్ట్ర కార్యదర్శులు, కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.

మరిన్ని వార్తల కోసం: 

సీసీటీవీ ఫుటేజీ ఇస్తే దునియాకు నిజాలు చూపిస్తాం: ప్రకాశ్‌ రాజ్

పాక్‌తో మ్యాచ్‌‎కు టీమిండియాలో వీళ్లు ఉండాల్సిందే 

ఫేస్‌బుక్ లైవ్ పెట్టి భర్త సూసైడ్ అటెంప్ట్