
- డెంగ్యూతో చిన్నారి మృతి
- ఉపాధి కోసం దుబాయ్‌కు వలస వెళ్లిన తల్లిదండ్రులు
- జగిత్యాలలో అమ్మమ్మతో కలిసి ఉంటున్న ఆద్యశ్రీ
జగిత్యాల టౌన్, వెలుగు: డెంగ్యూతో జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి గ్రామానికి చెందిన ఆద్యశ్రీ(6) చనిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు గాడిపెల్లి శ్రీధర్, -అలేఖ్య దంపతులు ఉపాధి కోసం దుబాయ్ కు వెళ్లారు.
వారి ఇద్దరు పిల్లల్లో ఒకరు నానమ్మ దగ్గర స్వగ్రామంలో ఉండగా, ఆద్యశ్రీ అమ్మమ్మతో జగిత్యాలలో ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ నెల 26న ఆద్యశ్రీకి జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆమెను మాతాశిశు కేంద్రంలో చేర్పించారు.
వైద్యులు డెంగ్యూ అని నిర్ధారించారు. జ్వరం తీవ్రత పెరిగి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కావడంతో మంగళవారం ఉదయం చనిపోయింది. ఈ విషయం దుబాయ్ లో ఉన్న తల్లిదండ్రులకు తెలియజేయడంతో, వారు వీడియో కాల్ చేసి కూతురి డెడ్‌బాడీ చూస్తూ కన్నీరుమున్నీరయ్యారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని..
మహబూబ్ నగర్ రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని మహబూబ్ నగర్ నగరంలోని తిరుమలహిల్స్ సమీపంలో ఒకరు చనిపోయారు. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని హన్వాడ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన రంగాచారి(30) కూలీ పనులు చేస్తూ బతుకుతున్నాడు.
మంగళవారం రంగాచారి బైక్‌పై జడ్చర్లకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా, తిరుమలహిల్స్ సమీపంలోకి రాగానే ఆర్టీసీ బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. తీవ్రగాయాలై రంగాచారి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.