చిన్నారి పెళ్ళికూతుళ్ళు ఎక్కువైతున్నరు

చిన్నారి పెళ్ళికూతుళ్ళు ఎక్కువైతున్నరు

కరోనా ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా పడింది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలపై ప్రభావం ఇంకోలా ఉంది. అదెలాగంటే.. ఆడిపాడాల్సిన వయసులో పెళ్లిపీటలెక్కారు. పుస్తకాలు మోయాల్సిన వయసులో మెట్టింటి బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు వాళ్లు. ఊరూవాడా అనే తేడాలేకుండా ప్రపంచమంతటా ఇదే పరిస్థితి. 

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఆడపిల్లల్లో ఒకరు పద్దెనిమిదేళ్లకు ముందే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. మన దేశంలో ఏటా  15 లక్షల మంది అమ్మాయిలకి చిన్నవయసులో పెళ్లిళ్లు అవుతున్నాయని అంచనా. ఈ ప్యాండెమిక్ వల్ల  ఆ లెక్కలు మరింత పెరిగాయి. దానికి కారణాలేంటంటే.. 

27 శాతం పెరిగాయి
ప్యాండెమిక్​కి ముందు గడిచిన పదేళ్లలో ప్రపంచంలో  చైల్డ్ మ్యారేజ్​లు 15% తగ్గాయి. అంటే నలుగురిలో ఒకరి నుంచి ఐదుగురిలో ఒకరికి తగ్గి.. 2.5 కోట్ల మంది ఆడపిల్లలు చిన్న వయసులో పెళ్లి నుంచి తప్పించుకున్నారు. దాంతో వచ్చే పదేళ్లల్లో  చైల్డ్ మ్యారేజ్​ల సంఖ్య మరింత తగ్గుతుందనుకున్నారు అంతా. కానీ, కరోనా ఆ అంచనాలన్నింటినీ తారుమారు చేసింది. ప్యాండెమిక్ వల్ల ప్రపంచ వ్యాప్తంగానే కాదు మన తెలంగాణాలోనూ బాల్య వివాహాలు 27% పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ లెక్కలు మరింత పెరుగుతాయంటున్నారు ఎక్స్​పర్ట్స్. 

పేదరికమే 
బడి, కాలేజీల బాట పట్టాల్సిన ఆడపిల్లల పెళ్లిళ్లకి కారణం కరోనానే అంటోంది యూనిసెఫ్​. కొవిడ్ వల్ల సిటీల్లో ఉపాధి కోల్పోయిన వాళ్లంతా సొంతూళ్లకి వెళ్లారు. అక్కడ చేతిలో పనిలేదు.. తినడానికి తిండి లేదు. దాంతో రేపు ఎలా ఉంటుందోనన్న భయం పట్టుకుంది తల్లిదండ్రులకి. మాకు ఏమన్నా అయితే మా పిల్లల పరిస్థితేంటన్న ఆలోచనలు. దాంతో కూతుళ్ల బాగోగుల గురించి ఆలోచించి చిన్నవయసులోనే పెళ్లిపీటలెక్కించారు.. దేశవ్యాప్తంగా జరిగిన చిన్నారుల వివాహాల్లో 85 శాతం ఇలా జరుగుతున్నవే. పిల్లలు ఇంటిపట్టునే ఉంటే ఏమైనా అఘాయిత్యాలు జరుగుతాయేమో లేదా ఎవరితోనైనా ప్రేమలో పడితే ఇబ్బందులు వస్తాయేమో అన్న భయాలు కూడా  చైల్డ్ మ్యారేజ్​లకి కారణం అయ్యాయి. వాట్సాప్​లో ఎక్కువ సేపు ఛాట్ చేస్తుందని.. ఫోన్ ఎక్కువ వాడుతుందని.. ఫలానా వాళ్లతో చనువుగా ఉంటోందన్న భయాలతో.. ఆడపిల్లల్ని అత్తారింటికి పంపిన తల్లిదండ్రులు ఉన్నారు. గ్రామాల్లో జరిగే చిన్నారుల వివాహాలకి ఎక్కువగా ఇవే కారణాలు అవుతున్నాయి . అయితే కొందరు తల్లిదండ్రులు ఎదురు కట్నాలు తీసుకొని మరీ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. 

ఆసరా
అప్పటికే మూడుపెళ్లిళ్లు అయిన వ్యక్తికి 15 ఏండ్ల అమ్మాయితో పెళ్లి కుదిర్చారు పెద్దలు. మరో చోట 17 ఏండ్ల అమ్మాయికి పెళ్లికి ముహూర్తం పెట్టారు మన తెలంగాణలో. పెళ్లి కుదిరిన ఆ అమ్మాయిలిద్దరికీ చదువుకోవాలనుంది. కానీ, వాళ్ల ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని కట్నం వద్దన్నారు అత్తింటివాళ్లు.. పైగా పెళ్లి ఖర్చంతా తమదే అన్నారు.. ఎదురు కట్నమిస్తామన్నారు. ఇంకేముంది.. ఆడపిల్లను భారంగా చూసే తల్లిదండ్రులకి రూపాయి ఖర్చు లేకపోవడంతో సంతోషంగా ఒప్పుకున్నారు.  ఈ రెండు సందర్భాల్లోనే కాదు మన దేశంలో చాలా వరకు చిన్నారుల వివాహాలు ఇలాంటి పరిస్థితుల్లోనే జరుగుతున్నాయి.

చదువెందుకు?
ఎంత చదివినా అత్తగారింట్లో బాసిన్లు తోమాల్సిందేగా? దానికి లక్షలు పోయడం ఎందుకు? ఆర్ధికంగా బాగున్న కుటుంబాల్లోనూ ఇవే మాటలు.పెళ్లి చేస్తే ఓ భారం దిగిపోతుంది..పైగా వెతుక్కుంటూ వచ్చిన సంబంధాన్ని కాదనడం ఎందుకంటూ  చదివించే స్తోమత ఉన్నా మైనర్లకు పెళ్లి చేశారు. ఈ ప్యాండెమిక్ వల్ల  ఇరవైనాలుగ్గంటలూ పేరెంట్స్ కళ్ల ముందే ఉంటున్నారు పిల్లలు. పైగా  స్కూళ్లు ఎప్పుడూ తెరుచుకుంటాయో తెలియదు. దాంతో ‘పెళ్లి చేస్తే ఓ పనైపోతుంది’ అనుకుంటున్నారు మరికొందరు పేరెంట్స్​. ప్యాండెమిక్​లో పిల్లలకు వివాహాలు పెరగడానికి ఇదీ ఒక కారణమే.  మామూలు రోజుల్లో అయితే పెళ్లి చేసేస్తామన్నప్పుడు అమ్మాయిలు స్కూల్​లో  ఫ్రెండ్స్​ లేదా టీచర్లతో విషయం చెప్పి సలహా అడుగుతారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు.

కఠిన చట్టాలు రావాలి..
పదేళ్ల అమ్మాయిని పెళ్లి బారినుంచి కాపాడడంతో 2000 సంవత్సరంలో మొదలైంది మా తరుణి ఫౌండేషన్. గవర్నమెంట్ స్కూల్స్​లో ఆడపిల్లలకి రీ ప్రొడక్టివ్ హెల్త్, లైఫ్ స్కిల్స్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు పదేళ్ల అమ్మాయికి పెళ్లి చేస్తున్నారని తెలిసి వాళ్ల  పేరెంట్స్​తో మాట్లాడితే చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆ క్షణం అనిపించింది చిన్న వయసులో వివాహాలకి బలవుతున్న ఆడవాళ్ల కోసం ఏదైనా చేయాలని. అప్పట్నించి బాల్యవివాహాలపై పోరాడుతూనే ఉన్నా..అయితే సర్వీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ వివాహాలకి రెండు నెలలు మాత్రమే జైలు శిక్ష ఉండేది. పోలీస్ స్టేషన్​లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేవాళ్లు కాదు. దాంతో  2004 లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్​లో  పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు పెట్టాం. రానున్న నెలలో జరగబోయే 60 పెళ్లిళ్ల డిటైల్స్ ఇచ్చి ఆపమన్నాం..వాళ్లు గవర్నమెంట్​కి ఆర్డర్స్ ఇస్తే కేవలం ఏడెనిమిదే ఆగాయ్. దాంతో మళ్లీ కంప్లైట్ ఇస్తే మానవ హక్కుల కమీషన్, మహిళా కమీషన్ మాతో కలిసింది.  చట్టంలో మార్పు తేవాలని గవర్నమెంట్​కి లెటర్ రాసి, పార్లమెంటరీ కమిటీ పెట్టింది. అలా 2006 లో  చిన్నారులకు పెళ్లిళ్లు చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానాతో కొత్త చట్టం వచ్చింది.  చైల్డ్ మ్యారేజెస్​ ఆపడానికి విలేజ్ స్థాయిలో ఆఫీసర్లు...అమ్మాయి పెళ్లి వద్దనుకుంటే వెంటనే విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకునే వరకు మనోవర్తి ఇవ్వాలని చట్టం వచ్చింది.ఆ చట్టానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూల్స్ రావడానికి మరో నాలుగేళ్లు కోర్టు చుట్టూ తిరిగాం.

ఇంత కష్టపడ్డాక కూడా ఎక్కడా చట్టం కరెక్ట్​గా అమలుకాలేదు. కానీ, పెళ్లికి వచ్చిన బంధువులు, పురోహితుల మీద కూడా కేసు పెట్టడంతో కాస్త వెనక్కి తగ్గాయి. తర్వాత యూనిసెఫ్, ఇతర ఎన్జీవోలు, బాలికా సంఘాలతో ఈ వివాహాలపై అవగాహన పెంచడం మొదలుపెట్టాం. కానీ, ఈ  ప్యాండెమిక్ మా కష్టాన్నంతా తుంగలో తొక్కేసింది. మళ్లీ ఇప్పుడు పరిగెడుతున్నాం. బాల్యవివాహాల్లోనే గృహహింస ఎక్కువగా జరుగుతోంది.. ఆత్మహత్యలూ ఎక్కువే. అందుకే వీటిని  పూర్తిగా కట్టడి చేయాలంటే ఆడ పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలి.చదువుకునే పిల్లలకి ప్రతి సంవత్సరం స్కాలర్​షిప్​ ఇవ్వాలి. కనీసం డిగ్రీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఈ పెళ్లిళ్లని కొంతలో కొంతైనా తగ్గించగలం అంటోంది మమత.

వీళ్లే బలవుతున్నారు
ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలున్న కుటుంబాల్లో చిన్నారుల వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.  తల్లి లేదా తండ్రి చనిపోవడం కూడా చైల్డ్ మ్యారేజ్​లకి కారణం అవుతుంది. అయితే ఈ పెళ్ళిళ్ళు ఎక్కువగా దగ్గరి బంధువులు, బాగా తెలిసిన వాళ్లు, మేనరికపు సంబంధాల్లోనే జరుగుతున్నాయి.  అలాగే సిటీలతో పోలిస్తే పల్లెటూళ్లు, గిరిజన తాండాల్లో ఎక్కువగా ఈ వివాహాలు జరుగుతున్నాయి. వీటికి కారణం అవగాహన లేకపోవడమే అంటోంది విమెన్ అండ్ చిల్డ్రన్​ రైట్స్ యాక్టివిస్ట్ మమతా రఘువీర్ ఆచంట. 
ప్రపంచంలో చిన్నారులకు ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతున్న దేశాల్లో మనం నాలుగో స్థానంలో ఉంది. ఈ ప్యాండెమిక్ ఇప్పట్లో దేశాన్ని వీడకపోతే  వాటి రేటు మరింత పెరుగుతుంది. వీటి నుంచి ఆడపిల్లల్ని కాపాడాలంటే  జనాల్లో అవగాహన పెంచాలి. మరీ ముఖ్యంగా కూలీ, వ్యవపాయ పనులు చేసుకునే పేద కుటుంబాలకి, పెద్దగా చదువుకోని వాళ్లకి ఈ వివాహాల వల్ల జరిగే నష్టాల్ని చెప్పాలి. కేవలం తల్లిదండ్రులకే కాదు మైనర్ అమ్మాయిలకు కూడా వీటి వల్ల ఎలాంటి నష్టం ఉంటుందో చెప్పాలి. వాళ్లందరిలో అవేర్​నెస్​ కల్పిస్తే చైల్డ్‌‌ మ్యారేజ్​లు కొంతైనా తగ్గుతాయంటూ 
తన ఎక్స్​పీరియెన్స్​ షేర్​ చేసుకుంది మమత.

::: ఆవుల యమున