బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు.. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ హెచ్చరికలు

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు.. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ హెచ్చరికలు

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో బాల్య వివాహాలు చేసుకున్నా, చేయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్  హెచ్చరించారు. ఆదివారం జిల్లా పోలీస్  కార్యాలయంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బాల్య వివాహాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాలికలను, మహిళలను  ప్రేమపేరుతో వేధిస్తే కేసులు నమోదు చేసి రౌడీ షీట్  ఓపెన్  చేస్తామని హెచ్చరించారు.

బాల్యవివాహాలకు బాధ్యులైన తల్లిదండ్రులు, బంధువులు, పూజారులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. చదువుకోవాల్సిన వయసులో ఆడపిల్లలను పెళ్లి పీటలు ఎక్కించి వారి బంగారు భవిష్యత్​ను అంధకారం చేస్తున్నారని పేర్కొన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు గ్రామ స్థాయిలో గ్రామీణ స్థాయి బాలల సంరక్షణ కమిటీ(వీసీపీసీ),  మండల బాలల పరిరక్షణ కమిటీ(ఎంసీపీసీ) ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని  తెలిపారు.

లోక్ అదాలత్ లో 2,737 కేసులు పరిష్కారం..

వనపర్తి జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో 2,737 కేసులు పరిష్కారమయ్యాయని ఎస్పీ తెలిపారు. కోర్టు విచారణలో ఉన్న 171 కేసులు, డ్రంక్  అండ్  డ్రైవ్, ఎంవీ యాక్ట్, ట్రాఫిక్  నిబంధనలు ఉల్లంఘించిన 514 కేసులు, 2007 ఈ పెట్టీ కేసులు మెగా లోక్ అదాలత్ లో పరిష్కారం అయ్యాయన్నారు. 

45 సైబర్  క్రైమ్  కేసుల్లో రూ.15, 10,698 బాధితుల అకౌంట్ కు రిఫండ్  చేసినట్లు చెప్పారు. కేసులను పరిష్కరించడంలో చొరవ చూపిన పోలీస్  అధికారులు, సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.