విద్యలో డిజిటల్​ టెక్నాలజీ.. శ్రుతిమించొద్దు!

విద్యలో డిజిటల్​ టెక్నాలజీ..  శ్రుతిమించొద్దు!

ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నది. మానవ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసే విద్య, కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం(సైన్స్) అనే నాలుగు అంశాలపై నిరంతరం పరిశోధనలు చేస్తూ, వెల్లడైన అంశాలను బట్టి సభ్య దేశాలకు సలహాలు, సూచనలు, విజ్ఞప్తులు ఇవ్వడమే కాకుండా హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. 

ఇలా విద్యారంగంలో చేసే పరిశోధనల్లో భాగంగా.. యునెస్కో చదువులపై టెక్నాలజీ ప్రభావాన్ని అంచనా వేయడానికి 14 దేశాల్లో ఒక అధ్యయనం చేసింది. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టును ‘విద్యలో సాంకేతికత’ అనే పేరుతో ఇటీవల విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. కరోనా సమయంలో బడులు మూతపడి ఆన్​లైన్ విద్య తప్పనిసరైనప్పుడు, వారి పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, ల్యాప్ టాపులను ఎంతో ఖర్చు చేసి కొన్నారు. 

కరోనా తర్వాత కూడా వీటి వాడకం ఏ మాత్రం తగ్గకుండా బడులు అలాగే కొనసాగిస్తున్నాయి. దాంతో ప్రభుత్వాలు, కొన్ని సంస్థలు బడుల్లో టీచర్ లేకున్నా ఏమీకాదు అనే విపరీత ధోరణితో ఉన్నాయని ఆ అధ్యయనం  వెల్లడించింది. కొత్తగా టీచర్లను నియమించకుండా, కేవలం రికార్డు చేసిన పాఠాలు చూపించడం వల్ల పిల్లలు అభివృద్ధి చెందలేరని కుండబద్దలు కొట్టింది. ఇలా డిజిటల్ పరికరాలను పాఠశాల స్థాయిలో అతిగా వినియోగించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కవగా ఉందని ఈ రిపోర్ట్ అభిప్రాయపడింది. 

డిజిటల్ ఉపకరణాల వాడకం

పాఠశాల స్థాయిలో డిజిటల్ సాధనాల్లో ఒకటైన స్మార్ట్ ఫోన్ ను అతిగా వాడటం వల్ల విద్యార్థులు చదువుపై అశ్రద్ధ వహించడం, హోం వర్క్ చేసేటప్పుడు గానీ పరీక్షల సమయంలో గానీ నిర్లక్ష్యంగా ఉండటం, ఇంట్లో పుస్తకాలు పట్టకపోవడం, ఒకవేళ పట్టినా పట్టుమని ఒక గంటసేపు కూడా కుదురుగా కూర్చొని చదవకపోవడం, పదేపదే స్మార్ట్ ఫోన్ చూడడం, మాటిమాటికి ఇన్​స్టా, ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్ చూడడం, చిరాకు, కోపం, అశాంతి, ఆందోళన వంటి మానసిక సమస్యలు, తలనొప్పి, కంటి వ్యాధులు వస్తున్నాయి. 

విద్యార్థులు, వారికి చెప్పిన పాఠాల్లో నుంచి కనీస పరిజ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు నేర్చుకోలేక పోతున్నారని అర్థం. యునెస్కో నివేదిక ప్రకారం దాదాపు సగం మంది టీచర్లకు డిజిటల్ పరికరాలను ఎలా వాడాలనే అంశంపై కనీస శిక్షణ కూడా  ఇవ్వలేదని, వారికి సైబర్ భద్రత మీద ఎలాంటి అవగాహన లేదని తేటతెల్లమైంది. ఇంకా డిజిటల్ ఉపకరణాలను కొనడం పేద కుటుంబాలకు ఆర్థికంగా భారం అవుతుందని తద్వారా  నిరుపేద విద్యార్థులు సరైన విద్యను పొందలేకపోతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. 

పాఠశాల విద్యలో  టెక్నాలజీ వాడటం వల్ల విద్యార్థుల్లో  చదువులు మెరుగుపడ్డాయనడానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రుజువులు లేవని ఈ నివేదిక చెప్పింది.  కానీ, విద్యా టెక్నాలజీని అమ్మే కంపెనీలు మాత్రమే మార్కెటింగ్ టెక్నిక్ లో భాగంగా వారికి అనుకూలంగా కొన్ని సాక్ష్యాలను చూపిస్తూ, వారి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.   

యునెస్కో చేసిన  సిఫార్సులు

విద్యలో డిజిటల్ సాధనాల వాడకం శృతిమించకుండా ఉండేందుకు యునెస్కో కొన్ని సిఫారసులు చేసింది. బోధనలో వాడే టెక్నాలజీ విద్యార్థి జ్ఞానాన్ని పెంపొందించేదిగా ఉండాలి. అంటే క్లిష్టమైన/అమూర్తమైన అంశాలను విద్యార్థి సులువుగా, తనకు తానుగా మరింత లోతుగా అర్థంచేసుకోవడానికి డిజిటల్ సాధనాలు వాడాలి. బోధనలో వాడే డిజిటల్ పరికరాలన్నీ  టీచర్​కు సహాయకారిగా మాత్రమే ఉండాలని,  అవి ఎట్టి  పరిస్థితుల్లో టీచర్​కు ప్రత్యామ్నాయం కావని యునెస్కో నివేదిక నొక్కి చెప్పింది. 

ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్, ఫిన్​లాండ్, నెదర్లాండ్స్ దేశాలు యునెస్కో చేసిన సిఫార్సులను అమలుచేయనున్నట్లు ప్రకటించి, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచాయి. స్మార్ట్ ఫోన్ అంటే ఎంతో ఉత్సాహం చూపించే ఈ తరం పిల్లలకు టెక్నాలజీ లేకుండా కూడా జీవించడం నేర్పించాలి. 

- డా. శ్రీరాములు గోసికొండ,అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సీ మోంజీ వర్సిటీ