ఒంటరిగా ఉండలేక ఖాళీ దొరికినప్పుడల్లా..

ఒంటరిగా ఉండలేక ఖాళీ దొరికినప్పుడల్లా..

వస్తువును, ఆస్తుల్ని దానం చేస్తూపోతే అవి తరుగుతూ పోతాయి. కానీ, ఎంత దానం చేసినా తరగనిది మాత్రం  చదువు ఒక్కటే. అంతేకాదు పంచడం వల్ల ఎదుటివాళ్లను జీవితంలో పైకి తీసుకొచ్చేలా చేసేది కూడా చదువే. అందుకే అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పది అంటారు చాలామంది. ఆ మాటలను నిజం చేస్తూ చిన్న పిల్లల దగ్గరనుంచి పదో క్లాస్​ చదివే పిల్లల వరకు ఫ్రీగా ట్యూషన్స్‌‌ చెప్తున్నాడు యువరాజ్‌.

చెన్నైలోని కల్పకంలో ఉంటాడు నలభై ఐదేండ్ల యువరాజ్‌‌. డిగ్రీ వరకు చదువుకున్నాడు. తొమ్మిదో క్లాస్​ చదువుతున్నప్పుడు ముఖంపై బొబ్బలు లాంటివి రావడం మొదలయ్యాయి. అవి కాస్త ఎక్కువై ఇంటర్మీడియెట్‌‌ పూర్తయ్యేసరికి శరీరం మొత్తం వ్యాపించాయి. హాస్పిటల్‌కి వెళ్తే ‘ఇవి జెనటిక్‌‌ ప్రాబ్లమ్‌‌ వల్ల వస్తాయి. ఇప్పుడు వాటిని తగ్గించలేమ’ని చెప్పారు డాక్టర్లు. వాటివల్ల యువరాజ్‌‌ను అందరూ అసహ్యంగా చూసేవాళ్లు. మాట్లాడేందుకు దగ్గరికొచ్చే వాళ్లు కాదు. ‘శరీరం బాగోలేకపోతే మనిషికి విలువ ఇవ్వరా!’ అని బాధ పడేవాడు. ఆ కారణంగా కొన్నాళ్లు అందరికీ దూరంగా ఉన్నాడు.  

పిల్లల వల్ల సాధ్యమైంది  

ఎక్కువకాలం ఒంటరిగా ఉండలేక ఖాళీ దొరికినప్పుడల్లా దగ్గర్లో ఉన్న ప్రైవేట్‌‌ స్కూల్స్‌‌లోకి వెళ్లి చదువు చెప్పేవాడు. అలా వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది. చుట్టూ ఉన్నవాళ్లంతా తనను దూరం పెడుతుంటే, తన రూపు రేఖలేవీ పట్టించుకోని పిల్లలు యువరాజ్‌‌తో బాగా కలిసిపోయేవాళ్లు. ఆడుకునేవాళ్లు, ఆడించేవాళ్లు కూడా. వాళ్ల కల్మషంలేని ప్రేమ అతనికి బాగా నచ్చింది. పిల్లలతో ఉన్నంతసేపు  బాధంతా మర్చిపోయేవాడు. దాంతో ఎక్కువ టైం పిల్లలతో ఉండేందుకు టీచింగ్‌‌ను  వృత్తిగా మార్చుకున్నాడు. ఇక పిల్లలతోనే జీవితమని నిర్ణయించుకున్నాడు.

వాళ్లను మార్చాలని

మారుమూల గ్రామం నుంచి వచ్చిన యువరాజ్‌‌కు అక్కడుండే పిల్లల పరిస్థితి తెలుసు. ట్రైబల్‌‌ ఊళ్లలో సరైన స్కూల్స్‌‌ ఉండవు. దాంతో వాళ్లకు చదువుండదు. వాళ్లకు చదువు చెప్పించి సొసైటీకి దగ్గర చేయాలని అనుకునేవాడు. అందుకే కరదిట్టు అనే ఊళ్లో ఉండే యాభైమంది ఇరుల తెగ పిల్లలకు ఫ్రీగా చదువు చెప్తున్నాడు. తొమ్మిది, పది క్లాస్​ పిల్లలకు ట్యూషన్స్‌‌ చెప్తున్నాడు. కథలు చెప్పడం, రాయడం అలవాటున్న యువరాజ్‌‌ పిల్లల కోసం ఇప్పటివరకు 300లకు పైగా కథలు రాసాడు. వాటిని స్కూల్లో పిల్లలకు చెప్తూ, ఆడిస్తుంటాడు. 

‘కరదిట్టులో ఈ పిల్లలే చదువు నేర్చుకుంటున్న మొదటి తరం. ఇక ఇక్కడి  పిల్లలకే నా జీవితం అంకితం. వాళ్లకు చదువు పట్ల అవగాహన తెప్పించి పై చదువులు చదివేలా ఎంకరేజ్‌‌ చేస్తా. వీళ్ల తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు చదువు విలువ తెలిసి, మిగతా పిల్లల్ని స్కూల్లో చేరుస్తున్నారు’ అని యువరాజ్‌ అంటున్నారు.‌