కరోనాతో అనాథలైన పిల్లలకు బువ్వ లేదు.. బడి లేదు

కరోనాతో అనాథలైన పిల్లలకు బువ్వ లేదు.. బడి లేదు
  • మూడు పూటలా తిండి లేదు
  • మరికొందరికి చైల్డ్ మ్యారేజెస్
  • చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ స్టడీలో వెల్లడి
  • అధికారిక లెక్కల ప్రకారమే దేశంలో లక్షన్నర మందిపై ప్రభావం

హైదరాబాద్, వెలుగు : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి.. వేలాది మంది బాల్యాన్ని చిదిమేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఎందరో చిన్నారులు.. అనాథలుగా మారి చదువుకు, మూడు పూటల తిండికి, ఆటలకు దూరమయ్యారు. బడికి వెళ్లాల్సిన వయసులో ఏదో ఒక పనిలో చేరి కుటుంబ భారాన్ని మోస్తున్నారు. కొందరు ఆడపిల్లలు 18 ఏండ్లు నిండకముందే పెండ్లిళ్లు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారమే సుమారు లక్షన్నర మంది పిల్లల జీవితాలను కరోనా అతలాకుతలం చేసింది. పేరెంట్స్‌‌లో ఒకరిని, లేదా ఇద్దరినీ కోల్పోయిన పిల్లల జీవన స్థితిగతులపై ‘చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్’ ఇటీవల చేసిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడులో ఈ స్టడీ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో పేరెంట్స్‌‌లో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయిన 2,230 కుటుంబాలకు చెందిన 3,825 మంది పిల్లలపై ఈ ఏడాది జూన్ – ఆగస్టు మధ్య సర్వే నిర్వహించారు. వీరిలో తెలంగాణకు చెందిన పిల్లలు 891 మంది, ఏపీకి చెందిన వారు 1,855 మంది ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం 2020 ఏప్రిల్ 1 నుంచి 2022 అక్టోబర్ 10 మధ్య మన దేశంలో 5,28,835 మంది కరోనాతో చనిపోయారు. 1,47,773 మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోగా, మరో 10,600 మంది అనాథలుగా మారారని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ వెల్లడించింది. ఈ పిల్లలు హెల్త్, ఎడ్యుకేషన్, సోషల్ సెక్యూరిటీ, మానసిక ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మూడు పూటలా తిండి లేదు.. 

సర్వేలో పాల్గొన్న పిల్లల్లో 976 మంది.. తమ పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి రోజుకు ఒకటి, రెండు పూటలు మాత్రమే భోజనం చేశారు. వీళ్లలో 446 మంది మగపిల్లలు, 530 మంది ఆడపిల్లలు ఉన్నారు. రోజుకు మూడు పూటల కంటే తక్కువ భోజనం అందుకుంటున్న 976 మంది పిల్లల్లో 956 మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారే.

బడి దూరమైంది..

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్లో 147 మంది స్కూల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లడం మానేశారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల జోక్యం లేకుంటే మరో 99 మంది పిల్లలు బడి మానేసి ఉండేవారని ఈ స్టడీలో వెల్లడైంది. తల్లులను కోల్పోయిన 12 ఏళ్లు దాటిన పిల్లల్లో స్కూల్ డ్రాపౌట్స్ శాతం ఎక్కువగా ఉంది.

ఆడుకునే టైం లేదు..

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్లో 63 శాతం మంది ఆడుకునే టైం కూడా తగ్గిపోయిందని చెప్పారు. వారికి ఇంట్లో, బయట పనులు ఉండటం.. కరోనా భయం ఇంకా మానసికంగా కలవరపెడుతుండడమే ఇందుకు కారణమని వెల్లడైంది. 11 శాతం మంది అమ్మాయిలు, 8.5 శాతం మంది అబ్బాయిలు మాత్రమే ఆడుకోవడానికి సమయం దొరుకుతున్నదని చెప్పారు. 

వయసుకు మించిన భారం

కరోనాతో తల్లిదండ్రులను, లేదా వారిలో ఒకరిని కోల్పోవడంతో పిల్లలపై కుటుంబ బాధ్యతలు పెరిగాయి. ఇప్పటికే ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న 29 శాతం మంది అమ్మాయిలు, 21 శాతం అబ్బాయిలపై అదనపు భారం పడింది. సర్వేలో పాల్గొన్న వారిలో 62 మంది అబ్బాయిలు, 39 మంది అమ్మాయిలు బయట పనులకు వెళ్తున్నారు. వీళ్లలో 25 శాతం మంది మైకా మైనింగ్ ప్రాంతాల్లో శిథిలాలను తీయడానికి పని చేస్తున్నారు. తెలంగాణ, ఏపీలాంటి రాష్ట్రాల్లో మరో 23 శాతం మంది వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. జార్ఖండ్‌‌‌‌‌‌‌‌లోని మైకా మైనింగ్ ప్రాంతాల్లో ఐదేండ్ల నుంచి పదేండ్ల వయసున్న పిల్లలు కూడా పనులకు వెళ్తున్నట్లు గుర్తించారు. వీళ్లలో 26 మందికి భోజనం తప్పా ఎలాంటి కూలీ అందడం లేదు. సర్వేలో పాల్గొన్న 101 మంది పిల్లల్లో 73 మంది తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పని చేయడం ప్రారంభించారు. బయట పనులకు వెళ్తున్న పిల్లల్లో చాలా మంది బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారే. మరో 20 మంది పిల్లలు పని కోసం నగరాలకు వలస వెళ్లాల్సి వచ్చింది.

చిన్నారి పెండ్లి కూతుళ్లు

తల్లిదండ్రుల మరణానంతరం 17 మంది పిల్లలకు మైనార్టీ తీరకముందే పెండ్లిళ్లు చేశారు. ఈ 17 మంది పిల్లల్లో 15 మంది తల్లిని కోల్పోగా, ఇద్దరు తండ్రిని కోల్పోయారు. పదిహేను మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారే. అలాగే ఈ సర్వేలో పాల్గొన్న కుటుంబాల్లోని గార్డియన్స్.. మరికొద్ది రోజుల్లో 61 మంది పిల్లలకు పెండ్లిళ్లు చేయబోతున్నట్లు చెప్పారు.