చిల్ డొనాల్డ్.. చిల్ అంటూ ట్రంప్‌‌పై ట్రోలింగ్

చిల్ డొనాల్డ్.. చిల్ అంటూ ట్రంప్‌‌పై ట్రోలింగ్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఓట్ల లెక్కింపులో ప్రస్తుతం ట్రంప్ మీద జో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. బైడెన్ ప్రెసిడెంట్ అవ్వడం దాదాపుగా ఖరారైనట్లే. ట్రంప్ ఓటమి దాదాపుగా ఖాయమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫలితాలపై క్లైమేట్ యాక్టివిస్ట్ 17 ఏళ్ల గ్రెటా థన్‌‌బెర్గ్ స్పందించింది. చిల్ డొనాల్డ్.. చిల్ అంటూ గ్రెటా చేసిన ట్వీట్ ప్రస్తుతం ట్రెండింగ్‌‌లో ఉంది.

గతేడాదికి గాను టైమ్ మ్యాగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌‌గా గ్రెటా నిలిచింది. గ్రెటాను టైమ్స్ మ్యాగజీన్ అవార్డుకు ఎంపిక చేయడంపై అప్పట్లో ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. తాజాగా గ్రెటా అదే మెసేజ్‌‌ను రిపీట్ చేస్తూ ట్రంప్‌‌పై వ్యంగ్యంగా కామెంట్ చేసింది. ఎన్నికల్లో తానే గెలిచానని, ఓట్ల కౌంటింగ్‌‌ను ఆపేయాల్సిందిగా ట్రంప్ చేసిన ట్వీట్‌‌పై గ్రెటా రియాక్ట్ అయ్యింది. ‘హాస్యాస్పదంగా ఉంది. కోపాన్ని నియంత్రించుకోవడంపై డొనాల్డ్ పని చేయాలి. ఆ తర్వాత ఓ ఫ్రెండ్‌‌తో కలసి పాత మూవీకి వెళ్లాలి. చిల్ డొనాల్డ్.. చిల్!’ అని గ్రెటా ట్వీట్ చేసింది.