కొత్త చిగురు తొడగనున్న మైత్రి

కొత్త చిగురు తొడగనున్న మైత్రి

ఇ ది బహుళ ధ్రువ ప్రపంచం. ఒకప్పుడు అమెరికా, అవిచ్ఛిన్న సోవియట్ యూనియన్ లు రెండు ధ్రువాలుగా ఉండేవి. సోవియట్ పతనానంతరం పరిస్థితులు మారాయి. అమెరికాకు పోటీగా చైనా అగ్ర దేశంగా ఎదుగుతూ వస్తోంది. ఇప్పటికీ దానికుండే లోటుపాట్లు దానికున్నాయి. అది వేరే సంగతి. కానీ, అమెరికాతో సై అంటే సై అనగల స్థాయికి అది చేరుకుంది. దేశం లోపల తలెత్తుతున్న సమస్యల దృష్ట్యా అది ఆ ప్రాబల్యాన్ని ఎంతకాలం నిలబెట్టుకుంటుందో చూడాలి. దాని ఆర్థికవ్యవస్థ అది పైకి చెప్పుకుంటున్నంత ప్రకాశమానంగా ఏమీ లేదని కొందరు విశ్లేషకుల మాట.

అది చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు కూడా ఏమంత గొప్పగా సాగడం లేదు. అప్పులు ఇవ్వడం ద్వారా మిత్ర దేశాలను కూడగట్టుకునేందుకు అది చేస్తున్న ప్రయత్నం ఎదురుతన్నే అవకాశం ఉంది. దాన్నలా ఉంచితే, సోవియట్ యూనియన్ ముక్కచెక్కలైన తర్వాత కూడా రష్యా సైనికంగా బలంగానే ఉంది. ఒకనాడు యూనియన్ లో భాగంగా ఉన్న ప్రాంతా(దేశా)లను తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ దాన్నే సూచిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కూడా భారత్ ఎటువైపూ మొగ్గకుండా అలీన విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది. 

కొత్త స్థాయిలు

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు 2005 జులైలో అమెరికాలో పర్యటించారు.  పౌర అణు ఒప్పందం, రక్షణ రంగంలో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఒక నూతన చట్రాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా భారత్- అమెరికా సంబంధాలు 2005లో ఉన్నత స్థాయికి ఎదిగాయి. భారతదేశాన్ని ఒక బాధ్యతాయుతమైన అణ్వస్త్ర సహిత దేశంగా అమెరికా గుర్తించింది. తదనంతర కాలంలో, అవి వ్యవస్థీకృతం కావడం, వాటికి రెండు దేశాల్లోనూ పాలక, ప్రతిపక్షాల నుంచి మద్దతు లభించడం విశేషం. అనేక స్థాయిల్లో ఉభయ దేశాలు ప్రభుత్వ, సైనికపరంగా కలిసిమెలిసి పనిచేయడానికి అవి దారితీశాయి. భారత్ కూడా అప్పటికన్నా ఎంతో బలోపేతమైంది. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2005లో సుమారుగా 800 బిలియన్ల డాలర్లు కాగా, నేడు అది 3.75 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ కూడా అనేక రెట్లు పెరిగింది. భారత్ తో అమెరికా వాణిజ్యం 2022–-23లో 128.8 బిలియన్ డాలర్ల మేరకు ఉంది. కానీ, అమెరికాకు ఇప్పటికీ వస్తువుల దిగుమతి ఎక్కువగా చైనా నుంచే ఉంది. అమెరికాకు చెందిన 3.2 ట్రలియన్ డాలర్ల విలువైన దిగుమతుల్లో చైనా వాటా16.5 శాతంగా ఉంది. భారతదేశంలో అమెరికా ప్రత్యక్ష పెట్టుబడులు 2021 నాటికే 13.82 బిలియన్ల డాలర్ల మేరకు ఉన్నాయని అంచనా. అమెరికా కాంగ్రెస్ (ప్రతినిధుల సభ, సెనేట్ కలిపి ఉభయ సభల సంయుక్త సమావేశం) నుద్దేశించి మోడీ రెండోసారి ప్రసంగించబోతున్నారు.

కీలక, ప్రవర్థమాన టెక్నాలజీల్లో చొరవ చూపించి రెండు దేశాలు కలిసి పనిచేయడాన్ని  ‘ఐసెట్’  అనే సంక్షిప్త పదంతో పిలుస్తున్నారు. అంతరిక్ష పరిశోధన, రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్ వర్క్ సిస్టంలు, 5జీ, 6 జీ వంటి అంశాల్లో భారత్-– అమెరికాలు కలిసి పనిచేస్తున్నాయి. జీఈ-ఎఫ్ 414 ఇంజన్ టెక్నాలజీని భారత్ కు బదలీ చేసే ఒప్పందంపై మోడీ పర్యటనలో సంతకాలు చేయనున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల విషయంలో కూడా భారత్ గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా పుడమి వేడెక్కకుండా తన వంతు కృషి చేస్తోంది. సౌర శక్తికి సంబంధించి అంతర్జాతీయ పథకాలు రూపొందిస్తోంది. 

సహజ మిత్ర దేశాలు

భారత్ – -అమెరికాలు ప్రపంచంలోనే రెండు పెద్ద ప్రజాస్వామిక దేశాలు. వ్యక్తిగత స్వాతంత్ర్యం, ప్రాథమిక  హక్కుల రక్షణకు రెండు దేశాల రాజ్యాంగాలు పెద్ద పీట వేసినవే. దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి అభివర్ణించినట్లుగా భారత్- – అమెరికాలు సహజ మిత్ర దేశాలు. స్వతంత్ర పంథాను అనుసరించడానికి రెండు దేశాలకూ హక్కుంది. కాబట్టి పరస్పర ప్రయోజనాలను మిళితమైన అంశాల్లో ఆదాన ప్రధానాలను పెంచుకోవచ్చు. కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలుండడాన్ని ప్రజాస్వామిక మౌలిక లక్షణంగానే ఇరు దేశాల నేతలూ భావించాలి. సెప్టెంబర్11 దాడుల తర్వాత అమెరికా అభ్యర్థించినా భారత్ తన సేనలను అఫ్గాన్​కు పంపలేదు. అమెరికా 2003లో ఇరాక్ పై దాడి చేసిన సందర్భంలో కూడా భారత్ సైనిక మద్దతు ఇవ్వలేదు. ఇరాన్, వెనిజులా చమురు బహిరంగ మార్కెట్ లో విక్రయం కాకుండా అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని కూడా భారత్ విమర్శించింది.

రష్యా, చైనాలు 2001లో ఏర్పాటు చేసిన షాంఘై సహకార సంస్థలో భారత్ కొనసాగుతూనే లద్దాఖ్ లో చైనా అతిక్రమణలను సైనికంగా ప్రతిఘటిస్తోంది. సహకార సంస్థలోకి ఇరాన్ ను తెచ్చేందుకు భారత్ కృషి చేసింది. అదే సమయంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలతో కలిసి ‘క్వాడ్’ గా ఏర్పడేందుకు భారత్ వెనుకాడలేదు. గాల్వన్ ఘర్షణల తర్వాత చైనాతో భారత్ 18 దఫాల చర్చలు జరిపింది. ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ లో చైనాతో కలిసి భారత్ పెద్ద భాగస్వామిగా ఉంది. పాకిస్తాన్ కు అమెరికా ‘అనుచిత’ సాయం కొనసాగుతున్నా భారత్ నిరసన తెలుపుతోంది తప్ప వేరే చర్యలకు దిగడం లేదు. దీన్నిబట్టి భారత్ ఏ అంశాన్ని ఆ అంశంగా విడిగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక అమెరికాలో భారతీయులు నలభై లక్షల ఇరవై వేల వరకు ఉంటారని అంచనా. భారత్-అమెరికాల మధ్య మైత్రికి అంతకన్నా సంకేతం ఏంకావాలి?

బలోపేతమవుతున్న భారత్

అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ భారతదేశం కూడా ఒక బలమైన శక్తిగా అవతరించే క్రమంలో వేగంగా పురోగమిస్తోంది. ప్రజాస్వామిక దేశం కావడంతో అంతర్జాతీయంగా సమున్నత స్థానం ఇవ్వడానికి చాలా దేశాలు సుముఖత చూపుతున్నాయి. అయితే, సైనికంగా, ఆర్థికంగా ఎదిగినప్పుడే ప్రపంచ దేశాల్లో భారత్ కు నిజమైన గౌరవాదరణలు లభిస్తాయి. కాబట్టే, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ భారత్ ముందుకు సాగుతోంది. యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని, శాంతియుత చర్చల ద్వారానే సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని రష్యాకు నిష్కర్షగా చెబుతూనే అది అమ్మజూపుతున్న చమురును, సైనిక సామగ్రిని కొంటోంది. అమెరికన్ డాలర్ల బదులు రూపాయల్లో వాణిజ్య లావాదేవీలకు తెరలేపింది. చైనా, పాకిస్తాన్ లతో ఉన్న సమస్యల పరిష్కానికి మూడవ దేశం సాయాన్ని కోరకుండా తన వంతు ప్రయత్నాలు సాగిస్తోంది.  

ఆ రెండు దేశాల నుంచి చొరబాట్లను, ఆక్రమణలను అడ్డుకునేందుకు తన తిప్పలేవో తానుపడుతోంది. తనకున్న వనరులలోనే ఇరుగుపొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లకు, ఇతర దేశాలకు సాయపడడానికి ముందుకు వస్తోంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో అమెరికాదే మొదటి స్థానమని అనుకునేవారు. ఇపుడు భారత్ ప్రజాస్వామిక విలువలకు పాటుపడుతూనే, వివిధ దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమైక్యత, సమగ్రతలను గౌరవిస్తూనే స్వీయ ప్రయోజనాల సాధనకు ఎలా పాటుపడవచ్చునో ప్రపంచానికి వెల్లడిస్తోంది. వీలైనన్ని దేశాలతో వీలైనంత సంబంధాల ద్వారా ప్రయోజనం పొందడమే భారత్ లక్ష్యమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వివరిస్తున్నారు. అందుకనే, భారత్ ను తన సమ ఉజ్జీగా చైనా భావించకపోయినా, అమెరికా అంతర్జాతీయంగా భారతదేశానికున్న ప్రాధాన్యాన్ని గుర్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ తాజా అమెరికా పర్యటన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోవడాన్ని ఈ నేపథ్యం నుంచి అర్థం చేసుకోవాలి.

చైనా దూకుడుకు కళ్లెం

భారతదేశానికి అమెరికా మూడో అతి పెద్ద సైనిక పరికరాల సరఫరాదారుగా ఉంది. అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై కూడా ఈ సందర్భంగా సంతకాలు జరిగే అవకాశం ఉంది. రష్యాతో పాటు అమెరికా నుంచి కూడా సైనిక సామగ్రిని భారత్ దండిగా కొనుగోలు చేస్తోంది. వ్యూహాత్మక వాణిజ్య అధీకృత లైసెన్సు మినహాయింపులో భారతదేశాన్ని1వ శ్రేణికి అమెరికా ఉన్నతపరిచింది. దాంతో సైనిక పరికరాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. భారతదేశ సైనిక సామగ్రి దిగుమతుల్లో అమెరికా వాటా11 శాతంగా ఉంది.

అంతర్జాతీయంగా ఆయుధాల ఎగుమతుల్లో అమెరికా వాటా 40 శాతంగా ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ఈమధ్యనే చైనా సందర్శించి వెళ్లినా రెండు దేశాల వైఖరుల్లోనూ మార్పు లేదని ఇరు పక్షాల నాయకుల ప్రకటనల ద్వారా తెలుస్తోంది. ఉక్రెయిన్ పై దాడి విషయంలో రష్యాకు చైనా అండగా నిలవడాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది. తైవాన్ పై దాడికి చైనా సన్నద్ధంగా ఉండడం కూడా అమెరికా కంటికి కునుకు లేకుండా చేస్తోంది. 
- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్