పాంగోంగ్‌‌‌‌‌‌‌‌ సరస్సుపై చైనా బ్రిడ్జి!

పాంగోంగ్‌‌‌‌‌‌‌‌ సరస్సుపై చైనా బ్రిడ్జి!
  • శాటిలైట్ ఇమేజీల ద్వారా వెల్లడి
  • చైనా భూభాగంలోనే పనులు
  • సైనికులను, ఆయుధాలను త్వరగా తరలించేందుకు డ్రాగన్ కుట్రలు

న్యూఢిల్లీ: చైనా తీరు మార్చుకోలేదు. సరిహద్దుల్లో హద్దు మీరుతోంది. ఇప్పుడు ఏకంగా లడఖ్‌‌‌‌‌‌‌‌లోని పాంగోంగ్ సరస్సుపై బ్రిడ్జి కడుతోంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఇమేజీలను జియో ఇంటెలిజెన్స్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ ‘డెమియన్ సిమోన్’ తాజాగా బయట పెట్టారు. శాటిలైట్‌‌‌‌‌‌‌‌ ఇమేజీలను పరిశీలిస్తే చైనా బ్రిడ్జి కడుతున్నట్లుగా కనిపిస్తోందని ట్వీట్ చేశారు. చైనా తన భూభాగంలోనే వంతెన నిర్మిస్తోంది. ఇది పాంగోంగ్ లేక్ రెండు ఒడ్డులను కలుపుతుంది. సరస్సుపై ఇరుకైన ప్రాంతంలో చేపట్టిన బ్రిడ్జి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. సైనికులను, భారీ ఆయుధాలను త్వరగా తరలించేందుకు ఈ వంతెన చైనాకు ఉపయోగపడుతుంది. 

గల్వాన్‌‌‌‌‌‌‌‌ లోయలో చైనా జెండా?

న్యూ ఇయర్ రోజున గల్వాన్‌‌‌‌‌‌‌‌ లోయలో తమ దేశ జెండాను ఎగురవేసినట్లు చైనా మీడియా వీడియో రిలీజ్ చేసింది. ‘‘ఇండియా బార్డర్ దగ్గర గల్వాన్ వ్యాలీలో ‘అంగుళం భూమిని కూడా ఎన్నడూ ఇవ్వవద్దు’ అన్న సందేశాన్ని పంపి పీఎల్ఏ సైనికులు చైనా ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు పంపారు” అని గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. ‘‘కొత్త ఏడాదిలో తొలిరోజున గల్వాన్ వ్యాలీలో చైనా జెండా ఎగిరింది. ఈ జాతీయ జెండా.. ఒకప్పుడు బీజింగ్‌‌‌‌‌‌‌‌లోని తియానన్మెన్ స్క్వేర్‌‌‌‌‌‌‌‌పై ఎగిరినంత ప్రత్యేకమైనది” అని చైనా ప్రభుత్వ అనుబంధ మీడియా ప్రతినిధి షెన్ శివెయ్ ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. గల్వాన్‌‌‌‌‌‌‌‌లో చైనా చొరబాట్లపై మౌనం వీడాలని ప్రధాని మోడీని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. చైనాకు బదులివ్వాలన్నారు. చైనా చొరబాట్ల వార్తలను ఆర్మీ వర్గాలు ఖండించాయి. గల్వాన్ లోయలో వివాదాస్పద ప్రాంతంలో చైనా జెండా ఎగరేయలేదని, ఆ దేశ భూభాగంలోనే వీడియో తీసి రిలీజ్ చేశారని తెలిపాయి.

ఎల్‌‌‌‌‌‌‌‌ఏసీ వెంబడి 60 వేల మంది చైనా సోల్జర్లు

తీవ్రమైన చలి పరిస్థితుల్లోనూ తూర్పు లడఖ్‌‌‌‌‌‌‌‌లో ఎల్‌‌‌‌‌‌‌‌ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వెంబడి 60 వేల మంది సోల్జర్లను చైనా మోహరించింది. అయితే ఇండియా కూడా అంతే స్థాయిలో సైనికులను తరలించింది. చైనా ఎలాంటి దుస్సాహసం చేయకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు  చేపట్టింది. సమ్మర్ ట్రైనింగ్ ట్రూప్స్‌‌‌‌‌‌‌‌ను చైనా విత్ డ్రా చేసుకుందని, కానీ లడాఖ్‌‌‌‌‌‌‌‌కు ఎదురుగా ఉన్న  ఏరియాల్లో 60 వేల మంది ఇంకా ఉన్నారని, డ్రాగన్ ముప్పుపై తమకు అవగాహన ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌కు ఆర్మీ సిద్ధంగా ఉందని చెప్పాయి.