మాటలతో చైనా బుద్ధి మారదు

మాటలతో చైనా బుద్ధి మారదు

ఎల్ఏసీ ఆక్రమణకు డ్రాగన్ ప్రయత్నించింది

తైవాన్ జలసంధిలోనూ మిలిటరీని దింపింది

చర్చలు.. అగ్రిమెంట్లతో మారదన్న విషయం తేలిపోయింది – అమెరికా ఎన్ఎస్ఏ రాబర్ట్ ఓబ్రెయిన్ ఫైర్

వాషింగ్టన్: ‘‘చైనా ఇక మారదు. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించడంపైనే డ్రాగన్ కంట్రీ కన్నేస్తూ వస్తోంది. ఆ దేశం ఇక చర్చలు, అగ్రిమెంట్లతో మారదన్న విషయం తేలిపోయింది..” అని అమెరికా ఘాటుగా వ్యాఖ్యానించింది. లడఖ్ లో బార్డర్ వెంబడి ఆక్రమణకు తెగబడిన చైనా.. లైన్ ఆఫ్​ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ తీవ్రంగా మండిపడింది. ఎల్ఏసీ వెంబడి చైనా ఆక్రమణల కారణంగా ఐదు నెలలుగా టెన్షన్ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ) రాబర్ట్ ఓబ్రియన్ ఇటీవల దీనిపై స్పందించారు. ‘‘చైనా బల ప్రయోగంతో ఎల్ఏసీని ఆక్రమించేందుకు ప్రయత్నించింది. డ్రాగన్ కంట్రీ ఇక చర్చలు, అగ్రిమెంట్లతో మారబోదన్న విషయాన్ని అంగీకరించాల్సిన సమయం వచ్చేసింది” అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండో చైనీస్ బార్డర్ లో ఎల్ఏసీని ఆక్రమించేందుకు చైనా చేసిన ప్రయత్నం స్పష్టంగా తేలిపోయిందన్నారు. చైనా విషయంలో వేరే మార్గం చూడటం లేదా మరో చెంపను చూపడం వల్ల ఏమీ లాభం లేదన్నారు. తైవాన్ జలసంధిలోనూ చైనా ఆర్మీ దురాక్రమణకు దిగడం నిజమేనని, అక్కడ చైనా నేవీ, ఎయిర్ ఫోర్స్ మిలటరీ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నాయన్నారు.

ఇండియాతో పార్ట్ నర్ షిప్ కీలకం..

ఇండో పసిఫిక్​లో మిలటరీ సంబంధాలను కూడా ట్రంప్ సర్కార్ బలోపేతం చేసిందని రాబర్ట్ ఓబ్రెయిన్ అన్నారు. 21వ శతాబ్దంలో ఇండియా తమకు కీలక పార్ట్​నర్​గా ఉందన్నారు. అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని చైనీస్ టెలికమ్యూనికేషన్ కంపెనీలు సేకరించకుండా కూడా అడ్డుకున్నామని తెలిపారు. చైనా కంపెనీలకు యూఎస్ సెమీకండక్టర్ టెక్నాలజీ, ఇతర ఎక్స్ పోర్టులపైనా ఆంక్షలు పెట్టామన్నారు. అనేక దేశాలు తమను ఫాలో అవుతున్నాయని తెలిపారు. ఇండియాలో జియో, ఆస్ట్రేలియాలో టెల్ స్ట్రా, సౌత్ కొరియాలో ఎస్ కే, కేటీ, జపాన్ లో ఎన్​టీటీ వంటి కంపెనీలు కూడా హువావే ఎక్విప్ మెంట్ వాడకాన్ని నిషేధించాయన్నారు. చైనా తలపెట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ వెనక కూడా అనేక అనుమానాలున్నాయని ఓబ్రియన్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ ను చైనా కంపెనీలు, చైనీస్ లేబర్ నే ఎక్కువగా వాడుతున్నట్లు తెలిపారు. ఓబీఓఆర్ లో చాలా ప్రాజెక్టులు అనవసరమని, వాటివల్ల ఆయా దేశాల సావరీనిటీకి భంగం కలుగుతుందన్నారు. ఐక్యరాజ్యసమితిలో చైనా చెప్పినట్టల్లా ఆడాల్సిన పరిస్థితి ఆ దేశాలకు వస్తుందన్నారు.

ఇండియా బార్డర్‌‌‌‌లో 60 వేల మంది  చైనా సోల్జర్లు: పాంపియో

చైనా ‘బ్యాడ్ బిహేవియర్’తో క్వాడ్ కంట్రీస్ (అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా)కు తీవ్ర ముప్పు ఏర్పడిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ఇండో చైనీస్ బార్డర్ లో చైనా 60 వేల మంది సోల్జర్లను చైనా మోహరించిందని, ఇండియా భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం టోక్యోలో క్వాడ్ కంట్రీస్ ఫారిన్ మినిస్టర్లు సమావేశమయ్యారు. టోక్యో నుంచి తిరిగి వచ్చిన పాంపియో శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్​తో జరిగిన ప్రత్యేక భేటీని ఆయన గుర్తుచేసుకున్నారు. చైనా దశాబ్దాలుగా మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీలను, లక్షలాది ఉద్యోగాలను చోరీ చేస్తోందని, అమెరికా సహా అన్ని దేశాల ప్రభుత్వాలూ నిద్రపోవడంతో చైనా అన్ని దేశాల్లోకీ చొరబడిందన్నారు.