
డ్రాగన్ కంట్రీ చైనానే తనకు మంచి దోస్తీ అనుకుంటున్న పాకిస్తాన్‌కు గట్టి షాక్ తగిలింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్‌లో చైనా అవినీతికి పాల్పడిందని తాజాగా ఓ నివేదికలో తేలడంతో పాక్ ఖంగుతింది. పైగా.. పాక్‌కు ఇచ్చే నిధులన్నింటిని చైనా ఆపేయడంతో.. భారీ వ్యయంతో మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. ఒక పక్కన కరోనా దెబ్బతో అల్లాడుతున్న పాక్.. చైనా కొట్టిన దెబ్బకు గందరగోళంలో పడింది.
మొదటి నుంచి పాకిస్తాన్, చైనా దేశాల మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఆర్ధిక సంబంధాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్‌కు చైనా ఎటువంటి సహకారం అందించడంలోనైనా ముందుండేది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్‌లో.. చైనా అవినీతికి పాల్పడిందని పాక్ మీడియాలో కథనాలు రావడంతో చైనా నిధులన్నింటినీ నిలిపివేసింది. దాంతో నమ్ముకున్న తన మిత్ర దేశమే మోసం చేసే సరికి.. పాక్‌కు ఏం చేయాలో అర్ధం కావడంలేదు.
‘వన్ బెల్ట్-వన్ రోడ్’లో భాగంగా చైనా చేపట్టిన ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టే ఈ సీపీఈసీ ప్రాజెక్టు. ఇదే చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్. ఇది చైనా స్వాధీనంలో ఉన్న జింజియాంగ్ ప్రాంతం నుంచి పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ను కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో చైనా దాదాపు 62 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. అయితే ప్రాజెక్ట్ నిర్వహణ కాస్ట్ పాక్‌కు ఎక్కువవుతుంది. దాంతో ఎలా చూసినా.. చైనా చెప్పినట్లు భారీ ఖర్చులు ఎక్కడా కనిపించలేదు. దాంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాజెక్ట్ ఖర్చులపై ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను చూసి పాకిస్తాన్ నోట మాట రావడంలేదు.
కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి ఎలక్రానిక్ రంగంలో చైనా పెట్టిన ప్రైవేట్ ఇన్వెస్టిమెంట్‌లో అవినీతి ఎక్కువగా జరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఈ రంగంలోనే చైనా భారీగా ఖర్చులు చూపించినట్లు తేలింది. దాదాపు 100 బిలియన్ల అవినీతి జరిగినట్లు అంచనా వేసింది. దాంతో పాటు సీపీఈసీ ప్రాజెక్ట్‌లో ఉన్న హుయెనెంగ్ షాన్డాంగ్ రుయి, ఎనర్జీ, సాహివాల్, పోర్ట్ ఖాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ లిమిటెడ్, బొగ్గు కర్మాగారాలు వంటి వాటిలో కూడా చైనా ఖర్చులను పెంచి చూపించిందని నివేదిక వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ వేసిన కమిటీ దాదాపు 278 పేజీల నివేదికను విడుదల చేసింది.
మరోవైపు.. పాక్ మీడియాలో అవినీతి వార్తలు రావడంతో.. ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు ప్రాజెక్టులకు నిధులను చైనా తాత్కాలికంగా ఆపేసింది. దాంతో 210 కిలోమీటర్ల పొడవైన డేరా ఇస్మాయిల్ ఖాన్-జోబ్ రోడ్డు నిర్మాణం ఆగిపోనుంది. దీన్ని 81 బిలియన్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇందులో 66 బిలియన్లను రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు చేస్తుండగా.. మరో 15 బిలియన్లను భూసేకరణ కోసం వినియోగించనున్నారు. అయితే ఇప్పుడు చైనా నిర్ణయంతో 110 కిలోమీటర్ల పొడవైన ఖుజ్దార్-బాసిమా రోడ్డు నిర్మాణంపై ప్రభావం పడనుంది.
ఖుజ్దార్ బాసిమా రోడ్డు నిర్మాణ అంచనా వ్యయం 19.76 బిలియన్ల రూపాయలు. మూడోది రాయ్ కోట్ నుంచి థాకోట్ వరకు 136 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న కరకారోమ్ హైవే. దీని నిర్మాణ అంచనా వ్యయం 8.5 బిలియన్ల రూపాయలు.
నిజానికి ఈ మూడు ప్రాజెక్టులు పాక్ ప్రభుత్వం గతంలో సొంతంగా చేపట్టాలని నిర్ణయించింది. అయితే డిసెంబరు 2016లో ఎన్‌హెచ్ఏ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. వాటిని సీపీఈసీ ప్రాజెక్టు కిందికి తీసుకొచ్చినట్టు ప్రకటించారు. దీంతో వీటికి నిధులు ఇచ్చేందుకు చైనా అంగీకరించింది. జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో నవంబరు 20న దీనికి సంబంధించిన ఒప్పందం చైనా, పాకిస్తాన్‌ల మధ్య కుదిరింది.
గత కొంతకాలంగా ఉగ్రవాదాన్ని నియంత్రించాలంటూ ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో తన వ్యాపార కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని చైనా మాత్రమే పాకిస్తాన్‌కు అండగా ఉంటోంది. అయితే ఇప్పుడు చైనా పెట్టుబడుల పేరుతో మోసం చేయడంతో.. పాక్ కన్ఫ్యూజన్‌లో పడింది. వడ్డీల రూపంలో చైనా ఆర్ధికంగా తమ దేశాన్ని దోచుకుంటుందని పాక్ ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
అసలే అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. దానికి తోడు ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా పాక్ ఆర్ధికంగా చితికిపోతొంది. ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ దేశాన్ని గట్టెక్కిస్తుందనుకున్న చైనానే సైలెంట్‌గా తమ దేశాన్ని దోచుకుంటోందని తెలియగానే.. ఏం చేయాలో అర్ధం కాక పాక్ ప్రభుత్వం తల పట్టుకుంది.
For More News..