పార్లమెంట్​లో ‘చైనా’ రగడ

పార్లమెంట్​లో ‘చైనా’ రగడ
  • బార్డర్​లో పరిస్థితిపై చర్చకు ప్రతిపక్షాల పట్టు
  • ఉభయ సభలను అడ్డుకున్న సభ్యులు.. పలు సార్లు వాయిదా

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చ చేపట్టాలంటూ పార్లమెంట్​లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. బార్డర్​ అంశంపై చర్చ జరపాల్సిందే అంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో గురువారం ఉభయ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ మొదలు కాగానే ప్రతిపక్ష సభ్యులు చైనాతో సరిహద్దు గొడవను లేవనెత్తారు. ప్రభుత్వం చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పలువురు ఎంపీలు ఇదే అంశంపై వాయిదా తీర్మానాలు ఇచ్చారు. దీంతో స్పీకర్​ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి వాయిదా పడింది. 2 గంటలలకు సభ మళ్లీ మొదలు కాగా.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ దేశంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రకటన చేశారు. 

ఈ సమయంలో ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగిస్తూ.. పెద్ద పెట్టున నినాదాలు చేశాయి. మంత్రి ప్రకటనను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అత్యవసర ప్రజా ప్రాముఖ్య అంశాలను ప్రస్తావించే సమయంలోనూ నిరసన కొనసాగించాయి. సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని స్పీకర్​ చైర్​లో ఉన్న కిరీట్​ సోలంకీ.. ప్రతిపక్ష సభ్యులను కోరినా ఫలితం లేకపోయింది. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. చైనా సైనికుల చొరబాట్లపై చర్చకు డిమాండ్​ చేస్తూ ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సభలో చర్చ జరిగిందని, మళ్లీ పట్టుబట్టడంలో అర్థం ఏంటని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషీ మండిపడ్డారు. కాంగ్రెస్​ హయాంలోనే  మన భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఆయన విమర్శించారు.