జీ20లో అమెరికా పెత్తనమేంది?..2026 సమిట్‌ నిర్వహణపై చైనా అభ్యంతరం

జీ20లో అమెరికా పెత్తనమేంది?..2026 సమిట్‌ నిర్వహణపై చైనా అభ్యంతరం
  • సభ్య దేశాలన్నీ కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచన
  • రొటేషన్‌ పూర్తయ్యాక మళ్లీ వాళ్లే ఎందుకు స్టార్ట్‌ చేయాలని ప్రశ్న
  • చైనాకు మద్దతుగా నిలిచిన రష్యా

బీజింగ్‌‌/న్యూఢిల్లీ: 2026లో జరిగే జీ20 సమిట్‌‌ను తాము నిర్వహిస్తామన్న అమెరికా ప్రకటనపై చైనా అభ్యంతరం తెలిపింది. ప్రస్తుతం భారత్‌‌లో జరుగుతున్న సమావేశాల అనంతరం బ్రెజిల్‌‌, సౌతాఫ్రికాలో సమిట్‌‌ ఉంటుందని, ఆ తర్వాతే అమెరికాలో నిర్వహిస్తామని వెల్లడించింది. బ్రెజిల్‌‌, సౌతాఫ్రికా సమావేశాలతో 2025లో రొటేషన్‌‌ పూర్తవుతుందని పేర్కొంది. ఆ తర్వాత 2026లో అమెరికాలో జరిగే జీ20 సమిట్‌‌తో రొటేషన్‌‌ స్టార్ట్ అవుతుందని బైడెన్‌‌ పరిపాలనా విభాగం తెలిపింది. శనివారం ఢిల్లీలో అమెరికా డిప్యూటీ నేషనల్‌‌ సెక్యూరిటీ అడ్వైజర్‌‌‌‌ జాన్‌‌ ఫైనర్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. 

తర్వాతి జీ20 సమావేశాలకు రెండు దేశాలకు అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత అమెరికా ఈ సమిట్‌‌కు ఆతిథ్యం ఇస్తుందని తెలిపారు. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. రొటేషన్‌‌ పూర్తయ్యాక మళ్లీ అమెరికానే జీ20 సమిట్‌‌ను ఎందుకు స్టార్ట్ చేయాలని ప్రశ్నించింది. సభ్య దేశాలు అన్నీ  చర్చించి తర్వాతి సమావేశాలు ఎక్కడ జరగాలో నిర్ణయించాలని చెప్పారు. కాగా, చైనాకు రష్యా మద్దతుగా నిలిచింది. చైనా అభ్యంతరంపై వైట్‌‌హౌస్‌‌ ఇప్పటివరకు స్పందించలేదు.