ఇప్పుడు మనం ఏం చేస్తాం : చైనా కొత్త మ్యాప్లో మన అరుణాచల్ ప్రదేశ్

ఇప్పుడు మనం ఏం చేస్తాం : చైనా కొత్త మ్యాప్లో మన అరుణాచల్ ప్రదేశ్

కుక్క తోక వంకర అన్నట్లుగా ఉంది చైనా తీరు. ఇప్పటికే ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలు..ద్వైపాక్షిక సమావేశాల్లో క్లారిటీ ఇచ్చినా కూడా..అరుణాచల్ పై మళ్లీ వింత వాదన..విచిత్ర వాదన, వికృత వాదన చేస్తోంది చైనా. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ బీరాలు పలుకుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ తమ అంతర్భాగంగా చూపిస్తూ చైనా కొత్త మ్యాన్ను విడుదల చేసింది.  

 చైనా కొత్త మ్యాప్ను 2023 ఏడాదిలో ఎడిషన్ పేరుతో తన అధికారిక వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. ఈ మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ తో పాటు..తైవాన్ ను, సౌత్ చైనా సముద్రాన్ని కూడా  పొందుపరిచింది.  చైనా కొత్త మ్యాప్ కు సంబంధించిన వివరాలను ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్వీట్లో వెల్లడించింది.

ప్రపంచంలోని వివిధ దేశాల జాతీయ సరిహద్దుల డ్రాయింగ్ పద్దతి ఆధారంగా చైనా ఈ మ్యాప్ ను రూపొందించింది. ఈ మ్యాప్ ప్రకారం దక్షిణ టిబెట్ గా అరుణాచల్ ప్రదేశ్ ను చైనా చూపిస్తోంది. 1962 యుద్ధంలో అక్సాయ్ చిన్ ను అక్రమించినట్లుగా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ ఎన్నటికీ భారత భూభాగమేనని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నా చైనా మాత్రం తీరు మార్చుకోవడంలేదు.

అటు తైవాన్ కూడా భూభాగమేనని చైనా వాదిస్తోంది.  తైవాన్ ద్వీపం చుట్టూ ఇటీవల నేవీ షిప్ లతో చైనా డ్రిల్స్ నిర్వహించింది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య  ఉద్రిక్తతలు కూడా నెలకొన్నాయి. అలాగే  సౌత్ చైనా సముద్రంలో తమకూ వాటా ఉందంటూ వియత్నాం, ఫిలిప్పీన్, మలేసియా, బ్రూనై, తైవాన్ వాదిస్తున్నాయి. అయితే ఈ దేశాల వాదనలను చైనా తోసిపుచ్చుతూ.. తాజా మ్యాప్ లో సౌత్ చైనా సముద్రాన్ని చైనాలో అంతర్భాగంగా చూపించింది.