ఇండియా బార్డర్లో చైనా డ్రోన్లు, ఫైటర్​ జెట్స్​

ఇండియా బార్డర్లో చైనా డ్రోన్లు, ఫైటర్​ జెట్స్​

అరుణాచల్​ ప్రదేశ్​ లోని తవాంగ్​ సెక్టార్​ వద్ద డిసెంబరు 9న భారత బలగాలతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో బార్డర్​ లో  చైనా దూకుడు పెంచింది.  భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో  ఉండే వైమానిక స్థావరాలను యాక్టివేట్​ చేసింది. టిబెట్​లోని బాంగ్డా, లాసా, షిగాత్సే ప్రాంతాల్లో ఉన్న తన వైమానిక స్థావరాలను అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాలతో నింపుతోంది.  ఇది వాస్తవమేనంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. టిబెట్​ లోని బాంగ్డా, లాసా, షిగాత్సే వైమానిక స్థావరాలలో పెద్ద సంఖ్యలో  ‘WZ-7 సోరింగ్​ డ్రాగన్​’  రకం డ్రోన్లు, ‘సుఖోయ్​ ఎస్​యూ 27’ రకం యుద్ధ విమానాలను చైనా మోహరించిందని నిర్ధారించే పలు శాటిలైట్​ దృశ్యాలతో తాజాగా కథనాలను ప్రచురించాయి. ఆ ఉపగ్రహ చిత్రాలు డిసెంబరు 14 నాటివని కథనంలో పేర్కొన్నాయి. 

చైనా విమానాలు చక్కర్లు కొడుతూ రెండుసార్లు..

ఇటీవల కాలంలో అరుణాచల్​ ప్రదేశ్​ లోని భారత గగన తలంలో  చైనా  విమానాలు చక్కర్లు కొడుతూ రెండుసార్లు భారత సైన్యం కంటపడ్డాయి. ఈ తరుణంలో టిబెట్​ లోని ఎయిర్​ బేస్​ లలో చైనా ఆయుధ సంపత్తి మోహరించిందనే వార్తలు బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలతో నిండుగా ఉన్న  టిబెట్​ లోని బాంగ్డా  ఎయిర్​ బేస్​ భారత్​ లోని అరుణాచల్​ ప్రదేశ్​ సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.  టిబెట్​ లోని  షిగాత్సే ఎయిర్​ బేస్​ నుంచి మన దేశంలోని సిక్కిం సరిహద్దు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. టిబెట్​ లోని లాసా ఎయిర్​ బేస్​ నుంచి ఇండియా బార్డర్​ 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. లాసాలో ఉన్న ఎయిర్​ బేస్​ విస్తరణ పనులను చైనా ప్రారంభించినట్లు శాటిలైట్​ ఫొటోలను బట్టి తెలుస్తోంది. అక్కడ రెండో విమాన రన్​ వేను చైనా నిర్మిస్తున్నట్లు సమాచారం. 

‘WZ-7 సోరింగ్​ డ్రాగన్​’  ఎందుకంటే..

బాంగ్డా, లాసా, షిగాత్సే వైమానిక స్థావరాలలో చైనా సిద్ధంగా ఉంచిన డ్రోన్ల జాబితాలో ‘WZ-7 సోరింగ్​ డ్రాగన్​’  అనే అత్యాధునిక డ్రోన్లు కూడా ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. నిర్విరామంగా గగనతలంలో 10 గంటల పాటు పహారా కాస్తూ ఎగరగల సామర్థ్యం ‘WZ-7 సోరింగ్​ డ్రాగన్​’  కు ఉంది. ఈ డ్రోన్​ నిర్దేశిత ప్రదేశాల గగన తలంలో తిరుగుతూ అక్కడి మ్యాపింగ్​, ఇమేజెస్​ ను సైనిక స్థావరానికి చేరవేస్తుంది. ఇది పంపించే మ్యాపింగ్​, ఇమేజెస్​ ఆధారంగా.. లక్ష్యం ఎంత దూరంలో ఉందనే దానిపై ఒక స్పష్టతతో సైన్యం  క్షిపణులను ప్రయోగిస్తుంది. ఇక బార్డర్​ లో చైనా మోహరించిన ‘సుఖోయ్​ ఎస్​యూ 27’ యుద్ధ విమానాల డిజైనింగ్​ కు మూలం రష్యాకు చెందిన సుఖోయ్​ 30ఎంకేఐ ఫైటర్​ జెట్​. దీనిలో పలు మార్పులు, చేర్పులు చేసి చైనా స్వదేశీ పరిజ్ఞానంతో  అభివృద్ధి చేసిన యుద్ధ విమానమే ‘సుఖోయ్​ ఎస్​యూ 27’.

ఇండియా సైతం అప్రమత్తం..

ఇక డిసెంబరు 9న అరుణాచల్​ ప్రదేశ్​ లోని తవాంగ్​ సెక్టార్​ వద్ద చైనా సైనికులు ఘర్షణకు పాల్పడిన నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. డిసెంబరు 15 నుంచి 16 వరకు రెండు రోజుల పాటు దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) యుద్ధ విమానాలతో  భారీ విన్యాసాలను  నిర్వహించింది. ఈ ఎక్సర్ సైజ్​లో రాఫెల్, సుఖోయ్ 30ఎంకేఐ ఫైటర్ జెట్ లు, రవాణా విమానాలు, హెలికాప్టర్​లు, డ్రోన్​లను వినియోగించారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో చైనా సోల్జర్లకు, మన సోల్జర్లకు మధ్య జరిగిన గొడవకు.. ఈ ఎక్సర్​సైజ్​కు సంబంధం లేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది.  ఇది అంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ లలో ఈ ఎక్సర్ సైజ్ జరిగిందని వెల్లడించింది.