చైనా అస్త్రాలు ఇవే!

చైనా అస్త్రాలు ఇవే!

నేషనల్​ డే పరేడ్​లో ప్రదర్శించనున్న డ్రాగన్​ కంట్రీ

పీఎల్​ఏ.. పూర్తిగా చెప్పాలంటే పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ. చైనా సైనిక బలగమిది. ప్రపంచంలోనే అతిపెద్దది. అలాంటి ఆ ఆర్మీ అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైన ఆయుధాలూ ఉన్నాయి. మరిన్ని ఆయుధాలు రాబోతున్నాయి. తన అమ్ములపొదిలోని ఆ అస్త్రాలన్నింటినీ ప్రపంచానికి చూపించబోతోంది డ్రాగన్​ కంట్రీ. అక్టోబర్​ 1న చైనా నేషనల్​ డే. బీజింగ్​లో నిర్వహించే సంబురాల్లో వాటన్నింటినీ ప్రదర్శించబోతోంది. దాదాపు 15 వేల మంది ఆర్మీ సిబ్బందితో పరేడ్​ చేయించబోతోంది. 160 యుద్ధవిమానాలు, 580 రకాల ఆయుధాలను ప్రపంచ దేశాలకు చూపించి తమ సత్తా ఏపాటిదో చూపించుకునేందుకు ఆ దేశం రెడీ అవుతోంది. ఒక్కసారి ఆ ఆయుధాల్లో కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం.

జేఎల్​ 2 సబ్​మెరీన్​ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్

చైనా జిన్​ క్లాస్​ అణు సామర్థ్య బాలిస్టిక్​ మిసైల్​ సబ్​మెరీన్లకు ఈ జేఎల్​ 2 సబ్​మెరీన్​ లాంచ్డ్​ బాలిస్టిక్​ మిసైల్​ (ఎస్​ఎల్​బీఎం)లే చాలా కీలకం. ప్రస్తుతం నాలుగు సబ్​మెరీన్లు సముద్ర జలాల్లో తిరుగుతున్నాయి. మరో రెండింటిని అభివృద్ధి చేస్తోంది. ఒక్కో సబ్​మెరీన్​లో 12 జేఎల్​ 2 (సింగిల్​ వార్​హెడ్​) మిసైళ్లు ఉంటాయి. 7,200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను జేఎల్​2 ఛేదించగలదు. చైనా తీర ప్రాంతాల నుంచి ఇండియా, అలస్కాలను ఈ మిసైళ్లతో చైనా ఈజీగా టార్గెట్​ చేయగలదు. దాని కన్నా మరింత పవర్​ఫుల్​ అయిన జేఎల్​3 మిసైల్​ను గత ఏడాది చివర్లో చైనా టెస్ట్​ చేసిందని సమాచారం. అదింకా తయారీ దశలోనే ఉంది.

టీ 99 ట్యాంక్.. లీడర్

టైప్​ 99, టైప్​ 15 యుద్ధ ట్యాంకులను ఇటీవలి రీహార్సల్స్​ చైనా చూపించింది. ఎడారి ప్రాంతాల్లో శత్రువుల కన్నుగప్పుతూ టైప్​ 99 యుద్ధ ట్యాంకులు ముందుకెళ్లిపోతాయట. చైనా యుద్ధ ట్యాంకులకు ఇదే లీడర్​.  దాంతో పాటు టైప్​ 15 లైట్​ ట్యాంకులనూ పరేడ్​లో ప్రదర్శించనుంది చైనా. వాటితో పాటు టైప్​–04 ఇన్​ఫాంట్రీ ఫైటింగ్​ వెహికల్​ (ఐఎఫ్​వీ), టైప్​05 ఆంఫిబియస్​ ఐఎఫ్​వీలనూ ప్రదర్శించనుంది. వాటి వివరాలేవీ బయటి ప్రపంచానికి ఇంకా తెలియదు. ఇవే కాదు, మరిన్ని శక్తిమంతమైన తన ఆయుధాలను బయటి ప్రపంచానికి చూపించి తన బలాన్ని నిరూపించుకోవాలని ఆ దేశం తహతహలాడుతోంది.

హెచ్​–6ఎన్​ బాంబర్​.. లాంగ్రేంజ్కు పెద్దన్న

చైనా ఎయిర్​ఫోర్స్​ ఫ్లీట్​కు ప్రధాన బలం ఇది. లాంగ్​ రేంజ్​ బాంబర్లకు పెద్దన్న ఈ హెచ్​–6ఎన్​ యుద్ధ విమానం. డీఎఫ్​–21 నౌకా విధ్వంసక క్షిపణులను ఇది మోసుకెళుతుంది. హెచ్​–6కేకి ఇది అడ్వాన్స్​డ్​ మోడల్​. గాల్లోనే ఇంధనం నింపుకునేలా అదనపు శక్తిని దీనికిచ్చింది చైనా.

డీఆర్​8 డ్రోన్​.. స్లిమ్గా, సౌండ్కన్నా స్పీడ్గా

చాలా స్లిమ్​గా ఉంటుందట ఈ డ్రోన్​. సౌండు కన్నా ఐదు రెట్ల వేగంతో గాల్లో దూసుకెళ్లే శక్తి దీని సొంతం. శత్రు దేశాల యుద్ధ విమానాల దగ్గరకెళ్లి దాని వివరాలను, మిసైల్​ లాంచర్లకు చేరవేయడం దీని పని.

నీళ్లలోపల పని పట్టేస్తది

దాని పేరేంటో ఇంకా తెలియనప్పటికీ.. ఇటీవలి రీహార్సల్స్​లో అది కనిపించింది. డ్రోన్​ సబ్​మెరీన్​గా దాన్ని పిలుస్తున్నారు. దాని పనేంటో మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు. దాని వివరాలను అంత గుట్టుగా ఉంచింది డ్రాగన్​ దేశం. ఇలాంటి అన్​మ్యాన్డ్​ అండర్​వాటర్​ వెహికిల్స్​ (యూయూవీ)లను డెవలప్​ చేయడానికి చైనా 15 రీసెర్చ్​ టీంలను ఏర్పాటు చేసిందని సమాచారం.

డీఎల్​17.. తక్కువ ఎత్తులో, అమిత వేగంతో

హైపర్​సోనిక్​ గ్లైడ్​ వెహికిల్​ (హెచ్​జీవీ)కి ఇది బెస్ట్​ ఉదాహరణ. ఓ మిసైల్​ రాకెట్​ నుంచి దీన్ని ఈజీగా లాంచ్​ చేయొచ్చు. ఇది ఓ ఎత్తుకు చేరుకున్నాక బూస్టర్​ రాకెట్​ హెచ్​జీవీని బలంగా ముందుకు నెడుతుంది. అక్కడి నుంచి హెచ్​జీవీ మిసైల్​ పేలోడ్​ను టార్గెట్​ దగ్గరకు తీసుకెళుతుంది. ఈ మిసైళ్లు చాలా తక్కువ ఎత్తులో గంటకు 6,115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. తద్వారా శత్రు దేశాల రాడార్​ కంట పడకుండా అది తప్పించుకోగలుగుతుంది. 2014 నుంచి చైనా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. 2020లో దానిని ఆర్మీలోకి తీసుకునే అవకాశం ఉంది. అటు న్యూక్లియర్​, ఇటు సంప్రదాయ వార్​హెడ్​లను మోసుకెళ్లే సత్తా దీని సొంతం.

కత్తిలాంటి డ్రోన్

గబ్బిలంలా ఉంటుంది. కత్తిలా పదునుగా శత్రువు మీదకు దూసుకెళుతుంది. శత్రువుల కంట పడకుండా పని కానిచ్చేస్తుంది. విమానాలపైకి బాంబులను వదులుతుంది. 2013లో దీనిని చైనా తొలిసారిగా టెస్ట్​ చేసింది. అయితే, ఆ డ్రోన్​లో వాడే వార్​హెడ్​లపై మాత్రం ఇంకా సస్పెన్స్​ ఉంది.

డీఎఫ్ 41 మిసైల్.. భూమ్మీదే అత్యంత పవర్ఫుల్

పరేడ్​ మొత్తంలో ఈ మిసైల్​పైనే అందరి దృష్టీ ఉంది. ఎందుకంటే ఇది ఖండాంతర క్షిపణి. అంటే, ఖండాల అవతల ఉన్న లక్ష్యాలను ఛేదించే సత్తా దీని సొంతం. 15 వేల కిలోమీటర్ల రేంజ్​ దీని సొంతం. పీఎల్​ఏ రాకెట్​ ఫోర్సెస్​కు ఇదే ప్రధాన అస్త్రం. అంతేకాదు, భూమ్మీదే అత్యంత శక్తిమంతమైన మిసైల్​ అట ఇది. ప్రపంచంలోని ఏ దేశానికీ అంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల మిసైళ్లు లేవు. ఆయుధాల పరంగా టాప్​లో ఉండే అమెరికాకూ అలాంటి ఆయుధం లేదంటే నమ్మలేరేమో. చైనా నుంచి దీన్ని ప్రయోగిస్తే అమెరికాను జస్ట్​ 30 నిమిషాల్లో చేరే సత్తా దీని సొంతమట. 10 శక్తిమంతమైన ఇండిపెండెంట్​ వార్​హెడ్​లతో ఇది ఉంటుందట. ఘన ఇంధనంతో ఇది దూసుకెళుతుందట. ఇటీవల మంగోలియాలోని ఓ సైట్​లో చైనా వాటిని పరీక్షించిందట. ఫెడరేషన్​ ఆఫ్​ అమెరికన్​ సైంటిస్ట్స్​ (ఎఫ్​ఏఎస్​) తీసిన శాటిలైట్​ ఫొటోల్లో 18 మిసైళ్లు కనిపించాయట. ఇంకా చైనా దగ్గర భారీగానే ఈ మిసైళ్లు ఉండి ఉంటాయని అమెరికా అనుమానం. ఇక, 1997 నుంచి దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చింది చైనా. 2015, 2017 మిలటరీ పరేడ్లలోనే దీన్ని ప్రదర్శిస్తారని భావించినా, చైనా దాన్ని గుట్టుగానే ఉంచింది. అయితే, ఇటీవల బీజింగ్​లో నిర్వహించిన పరేడ్​ రీహార్సల్స్​లో దీన్ని పెట్టడంతో, ఈసారి కచ్చితంగా పరేడ్​లో ఇదే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఆ దేశ మీడియా అంటోంది.