
న్యూఢిల్లీ: వివాదాస్పద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) వెంట చైనా దూకుడు పెరుగుతోందని, ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితి సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉందని డిఫెన్స్ మినిస్ట్రీ చెప్పింది. కుగ్రంన్ నాలా, గోగ్రా, పొంగ్యాంగ్, ఉత్తర ఒడ్డు ప్రాంతాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) ఇండియాలోకి ప్రవేశించిందని డిఫెన్స్ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ జూన్‌లో రిలీజ్ చేసిన ప్రధాన కార్యకలాపాల జాబితాలో చెప్పింది. “ పరిస్థితిని సమీక్షించేందుకు,రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. జూన్ 6న కార్ప్స్ కమాండర్ స్టాయి లెవెల్ మీటింగ్ జరిగింది. కానీ జూన్ 15న ఇరు పక్షాల హింసాత్మక ఘటన జరిగింది. దీంతో రెండు వైపుల సైనికులు చనిపోయారు” అని దాంట్లో ఉంది. ఢీ ఎస్కలేషన్ పద్ధతులపై చర్చించేందుకు జూన్ 22న తదుపరి చర్చలు జరిగాయని జూన్ నెలను మాత్రమే సూచించే ఆ డాక్యుమెంట్ చెప్పింది. సైనిక, దౌత్యస్థాయిలో సంభాషణలు పరస్పరం ఆమోదయోగ్యమైన ఏకాభిప్రాయానికి రావడం కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి సదీర్ఘంగా ఉంటుందని చెప్పింది. తూర్పు లడఖ్‌లో చైనా ఏకపక్ష దురాక్రమణ వల్ల తలెత్తిన పరిస్థితి సున్నితమైనదని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా దగ్గరి పర్యవేక్షణ, సత్వర చర్య అవసరమని మంత్రిత్వ శాఖ చెప్పింది. పాంగ్యాంగ్ దగ్గర్లోని ఫింగర్ ఏరియాలోని ఇరు దేశాల సైన్యాల మధ్య తీవ్రమైన తేడాలు, పీఎల్‌ఏ ఖాళీ చేయటానికి విముఖత కారణం, చర్చలు క్లిష్టమైన దశలోకి ప్రవేశించడంతో ఎల్‌ఏసీ వెంట తదుపరి దశల విరమణ గురించి చర్చించేందుకు భారత్, చైనా మిలటరీ కమాండర్లు ఆదివారం భేటీ అయ్యారు.