పాకిస్తాన్​లో పర్యటించిన జాక్‌‌ మా

పాకిస్తాన్​లో పర్యటించిన జాక్‌‌ మా
  • బోర్డ్  ఆఫ్  ఇన్వెస్ట్​మెంట్  మాజీ చైర్మన్  వెల్లడి
  • పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని వ్యాఖ్య

ఇస్లామాబాద్: అలీబాబా గ్రూప్  కోఫౌండర్, చైనా బిలియనీర్  జాక్  మా ఇటీవలే పాకిస్తాన్​లో పర్యటించారు. ఉన్నట్టుండి జాక్ మా పాక్​లో పర్యటించడంతో పరిశీలకులు షాక్​కు గురయ్యారు. ఆయన పర్యటన విషయాన్ని బోర్డ్  ఆఫ్​  ఇన్వెస్ట్ మెంట్  మాజీ చైర్మన్  ముహమ్మద్  అజ్ ఫర్  ఆషన్.. ప్రముఖ దినపత్రిక ద ఎక్స్​ప్రెస్ ట్రిబ్యూన్​కు వెల్లడించారు. గత నెల 29న జాక్ మా పాక్​లో పర్యటించారని, అయితే మీడియాతోగానీ, ప్రభుత్వ అధికారులతోగానీ ఆయన మాట్లాడలేదని ఆషన్  తెలిపారు. ‘‘జాక్ మా తన పర్యటనలో ఓ ప్రైవేటు లొకేషన్​లో బసచేశారు. ఆయన పర్యటన పూర్తిగా వ్యక్తిగతం. రహస్యం కూడా. మొత్తం ఏడుగురు వ్యాపారులతో ఆయన పాక్​కు వచ్చారు. 

ఆ ఏడుగురిలో ఐదుగురు చైనీయులు కాగా, ఒకరు డానిష్, మరొకరు అమెరికా పౌరుడు ఉన్నారు. హాంగ్  కాంగ్  బిజినెస్  విమాన రంగానికి చెందిన ఓ చార్టర్డ్  విమానంలో వారు నేపాల్  నుంచి పాక్​కు వచ్చారు. 23 గంటలు ఉండి జూన్ 30న తిరిగి వెళ్లారు” అని ఆషన్   పేర్కొన్నారు. కాగా, పాకిస్తాన్​లో వ్యాపార అవకాశాల కోసమే జాక్ మా తన బృందంతో పర్యటించి ఉంటారని సోషల్  మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు, అధికారులతో ఆయన భేటీ అయి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, జాక్ మా పర్యటన గురించి  పాక్ లోని చైనా ఎంబసీకి తెలియకపోవడం గమనార్హం.