
- తైవాన్ అధ్యక్షురాలి యూఎస్ పర్యటనపై చైనా గుస్సా
- అమెరికా వెళ్లొద్దని హెచ్చరించినా పట్టించుకోని సాయ్ ఇంగ్వెన్
- ఆంక్షల దిశగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అడుగులు
బీజింగ్ : తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ అమెరికా పర్యటనను చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ తీవ్రంగా ఖండించారు. అమెరికన్ రిపబ్లిక్ హౌజ్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీతో భేటీ కావొద్దని హెచ్చరించినా ఆమె పట్టించుకోలేదు. దీంతో రొనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ, ఇతర అమెరికన్, ఆసియా ఆధారిత సంస్థలపై ఆంక్షలు విధించేందుకు జిన్‌పింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా తైవాన్ రాయబారిపై నిషేధం ప్రకటించారు. తైవాన్ వైపు భారీ యుద్ధ నౌక షాన్డాంగ్ను మోహరించారు. తైవాన్‌పై ఫైటర్ జెట్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తైవాన్ కూడా చైనా చర్యలను తిప్పికొడుతున్నది. గురువారం కాలిఫోర్నియాలోని రొనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో కెవిన్ మెక్‌కార్తీతో సాయ్ ఇంగ్ వెన్ భేటీ అయ్యారు. దీన్ని నిరసిస్తూ లైబ్రరీ ముందు చైనా, తైవాన్ మద్దతుదారులు నిరసన తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతికి కృషి చేయాలని కోరారు. రీగన్ లైబ్రరీ, ఈ సంస్థలకు బాధ్యత వహిస్తున్న వ్యక్తులతో పాటు సాయ్ ఇంగ్ వెన్‌తో వెళ్లిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని చైనా నిర్ణయించింది.
తలదూర్చితే సహించబోమన్న జిన్‌పింగ్
తైవాన్‌తో ఒప్పందాలు చేసుకోవడమంటే చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లేనని ప్రపంచ దేశాలకు జిన్‌పింగ్ స్పష్టంచేశారు. ఇందులో తలదూర్చితే సహించేదిలేదని హెచ్చరించారు. అమెరికన్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీలతో చైనా ఎక్స్ఛేంజ్, కో ఆపరేషన్‌తో పాటు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిషేధం విధించినట్లు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది.