చైనా అధ్యక్షుడి అమెరికా టూర్.. వాషింగ్టన్‎లో ట్రంప్‌‌‌‌తో కీలక చర్చలు

చైనా అధ్యక్షుడి అమెరికా టూర్.. వాషింగ్టన్‎లో ట్రంప్‌‌‌‌తో కీలక చర్చలు

బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌‌‌‌పింగ్ ఈ నెల 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా వెల్లడించింది. 23న జిన్‌‌‌‌పింగ్ వాషింగ్టన్ చేరుకొని ట్రంప్‌‌‌‌తో ద్వైపాక్షిక శిఖరాగ్ర చర్చలు జరపనున్నారని తెలిపింది. 

కాగా, ఈ పర్యటనకు సన్నాహకంగా, న్యూయార్క్‌‌‌‌లో ఆదివారం ఇరుదేశాల ఉన్నతస్థాయి అధికారుల మధ్య ఆర్థిక, వాణిజ్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై చర్చలు జరిగాయి. చైనా ఉప ప్రధాని హే లీఫెంగ్, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, ఇరుపక్షాల ప్రయోజనాల సూత్రాల ఆధారంగా వ్యాపార అంశాలు, ఏఐ సంబంధిత విషయాలపై చర్చలు జరిపారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలుచేసే చైనా, భారత్ వంటి దేశాలపై 100 శాతానికి పైగా టారిఫ్‌‌‌‌లు విధించేలా అధికారం కట్టబెట్టిన చట్టంపై ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో ఈ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.