చిరంజీవి నన్ను విత్ డ్రా చేసుకోమన్నారు

చిరంజీవి నన్ను విత్ డ్రా చేసుకోమన్నారు

మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు మంచు విష్ణు. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన విష్ణు..నాపై నమ్మకం ఉంచి గెలిపించిన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్న నటులు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారన్నారు.అయితే తన ప్యానల్‌లో కొందరు సభ్యులు గెలవకపోవడం బాధాకరం. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో గెలిచిన వారిని కలుపుకొని పోతామని... మేమంతా ఒక్కటే అని అన్నారు.

అంతేకాదు ..నాగబాబు, ప్రకాశ్‌ రాజ్‌ల రాజీనామాను ఆమోదించడం లేదని స్పష్టం చేశారు. అయితే MAA ఎన్నికల్లో విత్‌ డ్రా చేసుకోమని చిరంజీవి తనకు సూచించారని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంతకుముందు రామ్ చరణ్ గురించి చెబుతూ మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ 99 శాతం ప్రకాశ్ రాజ్ కే ఓటేసి ఉంటాడని చెప్పగలనని, ఎందుకంటే చరణ్ తండ్రి మాట జవదాటడని అన్నారు. "నేను కూడా మా నాన్న మాటను పాటిస్తాను. చరణ్ కూడా అంతే. అందులో తప్పేమీలేదు. చరణ్ స్థానంలో నేనున్నా అదే చేస్తాను. ప్రకాశ్ రాజ్ కు ఓటేశాడని మా మధ్య అనుబంధంలో ఎలాంటి మార్పు ఉండదు. చరణ్ నాకు సోదరుడు" అని తెలిపారు.

ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న మంచు విష్ణు..​. నాగబాబు మా కుటుంబంలో సభ్యుడిలాగే. తొందరపడి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించను అని తెలిపారు. మా అధ్యక్ష స్థానంలో ఉన్న నేను నాగబాబు రాజీనామాను ఆమోదించనని... త్వరలోనే ఈ విషయం గురించి స్వయంగా ఆయనతోనే వెళ్లి మాట్లాడతానని అన్నారు. అలాగే ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామాను కూడా ఆమోదించను అని చెప్పారు. వాళ్లిద్దరి సపోర్ట్ నాకు కావాలని అన్నారు విష్ణు.