నల్గొండ జిల్లాలో సబ్సిడీ యూరియా అమ్ముతున్న ముఠా అరెస్టు

నల్గొండ జిల్లాలో సబ్సిడీ యూరియా అమ్ముతున్న ముఠా అరెస్టు

చిట్యాల, వెలుగు: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సబ్సిడీ యూరియాను దుర్వినియోగం చేసి అక్రమంగా డీజిల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌హాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) తయారీ చేస్తున్న ముఠాను చిట్యాల పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముఠాలో బిహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన నాగదేవ్ శంకర్ యాదవ్‌‌‌‌‌‌‌‌తో పాటు స్థానికంగా ఉన్న గోలి శంకరయ్య, మేడగోని దుర్గయ్య, వినోద్ కుమార్, రాజీవ్ రాయ్, రోషన్ కుమార్ ఉన్నారు.

 బిహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన శంకర్ యాదవ్ వెలిమినేడు గ్రామ శివారులో  ‘బిహార్ ఫ్యామిలీ దాబా నడుపుతున్నాడు. ఆదాయం సరిపోకపోవడంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. డీఈఎఫ్ తయారీ విధానాన్ని  రాజస్థాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన వ్యక్తి వద్ద నేర్చుకుని, వారి నుంచే రూ. 5 లక్షల విలువైన యంత్రాలు కొనుగోలు చేశాడు.  స్థానికుడైన అంజిరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఓపెన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ను లీజుకు తీసుకొని, ‘శ్రీహర్ష ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ ‘ పేరుతో షెడ్ నిర్మించి అనుమతులు లేకుండానే డీఈఎఫ్ తయారీ ప్రారంభించాడు.

డీఈఎఫ్ తయారీ

డీఈఎఫ్ తయారీలో మొదట హైదరాబాద్ నుంచి బస్తా రూ. 1500 కొనుగోలు చేసేవాడు. లాభం తక్కువ రావడంతో  సబ్సిడీ యూరియా గురించి తెలుసుకున్నాడు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన సొసైటీ ఉద్యోగులు గోలి శంకరయ్య, మేడగోని దుర్గయ్యలతో  బేరం కుదుర్చుకున్నాడు. రైతులకు ఇవ్వాల్సిన యూరియా బస్తాలను శంకర్ యాదవ్‌‌‌‌‌‌‌‌కు సరఫరా చేసేవారు. దీంతో వారికి ఒక్కో బస్తాకు రూ.30 కమిషన్ ఇచ్చేవాడు. కలెక్టర్ ఇలా త్రిపాఠి,  జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాలతో చిట్యాల సీఐ కె. నాగరాజు, ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో కలిసి శ్రీహర్ష ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైజెస్‌‌‌‌‌‌‌‌ పై దాడి చేశారు. 

దాడిలో ఎలాంటి అనుమతులు లేకుండా డీఈఎఫ్ తయారీ చేస్తున్న విషయం వెల్లడి కావడంతో నాగదేవ్ శంకర్ యాదవ్ ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. పోలీసులు వారి వద్ద నుండి డీఈఎఫ్ తయారీకి ఉపయోగించే సామగ్రితో పాటు బొలెరో వెహికల్, ఆటో స్వాధీనం చేసుకున్నారు.