పాపం.. క్రిస్​ చచ్చిపోయిండు

పాపం.. క్రిస్​ చచ్చిపోయిండు

క్రిస్​.. ఒంటి మీద మోయలేనంత ఉన్ని ఉన్న గొర్రె. ఆరోగ్యం చెడిపోవడంతో మంగళవారం చనిపోయింది. ఆస్ట్రేలియాలోని లిటిల్​ ఓక్​ శాంక్చువరీ వాళ్లు దాని బాగోగులు చూసుకునేవారు. 2015లో తొలిసారి క్రిస్​ వార్తల్లోకెక్కింది. కాన్​బెర్రా శివార్లలో ఓ ట్రెక్కర్​కు అది కనిపించడంతో అధికారులకు చెప్పాడు. దాన్ని తీసుకొచ్చిన అధికారులు, ఇంత ఉన్నితో అది బతకలేదని ఆందోళన చెందారు. ఆ ఉన్నితో క్రిస్‌  దాదాపు ఓ చిన్న కారు సైజులో ఉన్నాడట. దీంతో దాని ఉన్నిని కత్తిరించాలని డిసైడ్​ అయ్యారు. ఉన్ని తీయడంలో దిట్ట అయిన ఇయాన్​ ఎల్కిన్స్​ అనే నిపుణుడిని పిలిపించారు. నలుగురి సాయంతో ఎల్కిన్స్​ క్రిస్​ ఉన్నిని తీశాడు. దానిని తూకం వేస్తే 41.1 కిలోలుగా తేలింది. ఈ ఉన్ని కూడా ప్రపంచ రికార్డే. 2014లో న్యూజీలాండ్​లోని బిగ్​ బెన్​ అనే ఓ గొర్రె నుంచి 29 కిలోల ఉన్ని వచ్చింది. ఆ రికార్డును క్రిస్​ ఉన్ని బ్రేక్​ చేసింది. దీంతో ఆస్ట్రేలియాలోని నేషనల్​ మ్యూజియం ఆఫ్​ ఆస్ట్రేలియాస్​ ఓల్డ్​ న్యూ ల్యాండ్​ గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టారు. మామూలు గొర్రెకు 3 నుంచి ఐదు కిలోల ఉన్ని ఉంటుందని, దానిని తీయడానికి 3 నిమిషాలు పడుతుందని ఎల్కిన్​ చెప్పాడు. క్రిస్​ ఉన్నిని తీయడానికి మాత్రం 45 నిమిషాలు పట్టిందట.