
మెదక్, వెలుగు : క్రిస్మస్ వేడుకలకు ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ కెథడ్రల్ చర్చిముస్తాబయ్యింది. చర్చ్ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) మెదక్ డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా భక్తులు మెదక్ చర్చిలో జరిగే వేడుకలకు తరలివస్తారు. ఈ మేరకు చర్చి పాస్టరేట్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. చర్చి మెయిన్ టవర్, కమాన్లు, ప్రాంగణాన్ని, చర్చిలోపల కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. పెద్ద సైజు క్రిస్మస్ ట్రీని, క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్లకు కట్టేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు.
తెల్లవారు జామున 4:30 గంటలకే..
చర్చిలో ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకే ఫస్ట్ సర్వీస్ తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభం అవుతాయి. సీఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ మోస్ట్ రెవరెండ్ ఏ.సీ.సాల్మన్ రాజ్ భక్తులకు దేవుడి వ్యాక్యాన్ని వినిపిస్తారు. ఆ తర్వాత ఉదయం 9:30 గంటలకు సెకండ్ సర్వీస్ అయ్యాక భక్తులకు చర్చి దర్శనానికి అనుమతిస్తారు.
అడిషనల్ బస్సులు...
వివిధ ప్రాంతాల నుంచి మెదక్ చర్చిలో జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం బాలానగర్, ఎల్లారెడ్డి, చేగుంట, బొడ్మట్‌పల్లి రూట్ల నుంచి అదనపు బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ రవిచంద్ర తెలిపారు. సంగారెడ్డి డిపో నుంచి కూడా పలు బస్సులు నడుస్తాయన్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
ఈసారి మెదక్ చర్చిలో జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని మా అంచనా. ఇందుకు అనుగుణంగా స్థానిక పాస్టరేట్ కమిటీ, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశాం.
- జార్జ్ ఎబినైజర్ రాజు, ప్రెసెబిటరీ ఇన్చార్జి
గట్టి బందోబస్తు: మెదక్ ఎస్పీ
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మెదక్ చర్చిని చూసేందుకు, ప్రార్థనలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు రానున్న దృష్ట్యా భక్తులకు ఆటంకం కలగకుండా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 4 సెక్టార్లను ఏర్పాటు చేసి తనతో పాటు ఏఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 13 మంది సీఐ, ఆర్ఐలు, 49 మంది ఎస్సై, ఆర్ఎస్సైలతోపాటు 500 మందికి పైగా పోలీసులు ఉంటారని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ డాక్టర్ బాలస్వామి, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు సైదులు, యాదగిరిరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.