ది ఒడిస్సీ మూవీ ట్రైలర్ రిలీజ్.. నోలన్ ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గలే..!

ది ఒడిస్సీ మూవీ ట్రైలర్ రిలీజ్.. నోలన్  ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గలే..!

క్రిస్టోఫర్‌‌‌‌ నోలన్ అంటే ఓ డైరెక్టర్ కాదు.. యావత్ సినీ ప్రపంచంలో అదో బ్రాండ్. ప్రేక్షకుడి మెదడుకు పదును పెట్టే చిత్రాలతో బ్లాక్ బస్టర్స్‌‌ అందుకోవడం ఆయన స్టైల్. మెమెంటో,  డన్‌‌కర్క్,  ఇన్‌‌సెప్షన్,  ఇంటర్‌‌స్టెల్లార్,  టెనెట్,  ఒప్పెన్‌‌ హైమర్ లాంటి చిత్రాలతో మెప్పించిన ఈ జీనియస్‌‌ డైరెక్టర్‌‌‌‌ .. ఇప్పుడు ‘ది ఒడిస్సీ’ చిత్రాన్ని తెరకెక్కించారు. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు.  గ్రీకు పురాణాల్లో ప్రముఖంగా చెప్పుకునే ఒడిస్సియస్‌‌ రాజు లైఫ్‌‌ స్టోరీ ఇది.  

హోమర్ రాసిన ‘ఒడిస్సీ’ ఆధారంగా నోలన్ తెరకెక్కిస్తున్నారు. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇక నోలన్‌‌ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా టెక్నికల్‌‌గా మెప్పించింది ట్రైలర్‌‌‌‌. ట్రోజన్ యుద్ధం తర్వాత తన స్వదేశమైన 'ఇథాకా'కు చేరుకోవడానికి పదేళ్లపాటు ఒడిస్సియస్‌‌ అనే రాజు చేసిన సుదీర్ఘ ప్రయాణమే ఈ కథ. తన సైన్యంతో కలిసి సముద్రంపై బయలుదేరగా కొన్ని వారాల్లో ముగియాల్సిన ఆ ప్రయాణం దేవుళ్ళ ఆగ్రహం వల్ల పదేళ్లు పడుతుంది. 

విభిన్నమైన రాక్షసులు, వింతైన అవాంతరాలను ఎదుర్కొని అతను చేసిన ఈ జర్నీని ఎంతో సాహసోపేతమైనదిగా, స్ఫూర్తి దాయకమైనదిగా చెబుతుంటారు. అయితే వీటితో పాటు తన ఒడిస్సీ పాత్రలోని అంతర్గత సంఘర్షణపై తాను ఎక్కువ ఫోకస్ పెట్టానని, మూవీ నెరేషన్ విషయంలో తనపై బైబిల్‌‌ ఇన్ఫూయెన్స్‌‌ ఉందని  నోలన్ తెలిపారు. 

రాజు ఒడిస్సియస్‌‌గా మ్యాట్ డామన్‌‌, తన వైఫ్‌‌ పెనెలోపీగా అన్నా హాత్వే, కొడుకు టెలిమాకస్‌‌గా టామ్ హోలండ్ నటించారు. రాబర్ట్ ప్యాటిన్‌‌సన్, ఛార్లెజ్ థెరోన్ కీలకపాత్రలు పోషించారు.   పూర్తి ఐమాక్స్‌‌ కెమెరాలతో తీసిన ఈ మూవీ జులై 17న విడుదల కానుంది.  తెలుగుతో సహా పలు భారతీయ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.