
పిల్లల్ని ఆడించడం అంత ఈజీ కాదు. కానీ.. వినోద్ చందర్ తన వీడియోల ద్వారా పిల్లల్ని ఆడిస్తున్నాడు, పాడిస్తున్నాడు. తన కూతుర్ని ఆడించేందుకు చేసిన ప్రయత్నం వల్ల లక్షల మంది పిల్లల అభిమానం సంపాదించుకున్నాడు. వినోద్ నడుపుతున్న చుచు టీవీలో వీడియోలను ప్రతి రోజు కొన్ని లక్షల మంది పిల్లలు చూస్తున్నారు.
వినోద్ చందర్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2011లో పాప పుట్టింది. అప్పటినుంచి అతని లైఫ్ స్టైల్ చాలా మారింది. రోజూ కూతురితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. కూతురు హర్షితని ముద్దుగా ‘‘చుచు’’ అని పిలుచుకునేవాడు. ఆ పాపకు లాలి పాటలు వింటూ నిద్రపోవడం అలవాటైంది. ఆమె కోసం వినోద్ రోజూ పాటలు పాడేవాడు. అతనికి చిన్నప్పటి నుంచే సంగీతం వచ్చు. అతని తండ్రి చంద్రబోస్ 1980, 90ల్లో తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ మ్యుజీషియన్. 250కి పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. చంద్రబోస్ నుంచి వినోద్‌కి మ్యూజిక్ నాలెడ్జ్ వచ్చింది. చుచు పెరిగే కొద్దీ లాలిపాటలు వినడంతోపాటు రైమ్స్ వీడియోలు చూడడం అలవాటైంది. యానిమేటెడ్ నర్సరీ రైమ్స్ వీడియోలు చూస్తూ డాన్స్ చేసేది. కూతురికి యానిమేటెడ్ వీడియోలు ఇష్టమని గమనించిన వినోద్ కూడా అలాంటి వీడియోలు చేయాలనుకున్నాడు. మొదటగా నర్సరీ రైమ్.. ‘‘చబ్బీ చీక్స్’’పై వీడియో చేశాడు. దాన్ని కూతురికి చూపించాడు. అది ఆ పాపకు బాగా నచ్చింది. ఆ వీడియోని పిల్లలు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది. దాంతో 2013లో ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి, అందులో ఆ వీడియోను అప్‌లోడ్ చేశాడు. కొన్ని రోజుల్లోనే ఆ వీడియో వైరల్ అయింది. రెండు వారాల్లోనే మూడు లక్షల వ్యూస్ వచ్చాయి. అలా పుట్టిందే ‘‘చుచు టీవీ నర్సరీ రైమ్స్ అండ్ కిడ్స్ సాంగ్స్”.
ఎదుగుతూ వచ్చాడు
మొదటి నుంచీ వినోద్‌ది కష్టపడే వ్యక్తిత్వం. అతను మద్రాస్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. తర్వాత నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి చెన్నైలో ‘‘బడ్డీస్ ఇన్ఫోటెక్’’ పేరుతో సీడీ రైటింగ్, ప్రింటింగ్ సెంటర్ పెట్టాడు. 2001లో మొదలైన ఈ కంపెనీ గేమ్స్, యాప్స్ డిజైనింగ్, యానిమేషన్స్ రంగాలకు విస్తరించింది. తర్వాత ఐటీ సర్వీసులు అందించే స్థాయికి ఎదిగింది. వినోద్ యూట్యూబ్ ఛానెల్ పెట్టినప్పుడు ఆ కంపెనీ వల్ల వచ్చిన స్కిల్స్ ఉపయోగపడ్డాయి. చుచు టీవీలో కూడా తన ఫ్రెండ్స్‌ని పార్ట్‌నర్స్‌గా చేర్చుకున్నాడు.
60 మిలియన్ల మంది..
వినోద్ చుచు టీవీ ఛానెల్ పెట్టిన కొద్ది రోజులకే సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’పై రెండో వీడియో చేశాడు. మొదటి రెండు వీడియోలకే ఛానెల్‌ని ఐదువేల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. ప్రస్తుతం వినోద్ ఏడు భాషల్లో పది ఛానెల్స్ నడుపుతున్నాడు. ఈ ఛానెల్స్ కోసం దాదాపు 200 మంది పనిచేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళంతోపాటు బెంగాలీ, పోర్చుగీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. దాదాపు వంద దేశాల నుంచి ఈ ఛానెల్స్ చూస్తున్నారు. ముఖ్యంగా మనదేశం, అమెరికా, ఫిలిప్పీన్స్, కెనడా, వియత్నాం దేశాల్లో ఎక్కువ మంది చూస్తున్నారు. ప్రతి ఛానెల్‌కు మిలియన్ కంటే ఎక్కువ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. మెయిన్ ఛానెల్ ‘‘చుచు టీవీ నర్సరీ రైమ్స్ అండ్ కిడ్స్ సాంగ్స్’’కి 60.2 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఈ ఛానెల్లో అప్‌లోడ్ చేసిన ‘‘జానీ జానీ ఎస్ పప్పా..” వీడియోకు 1.9 బిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది ప్రపంచంలో ఎక్కువ వ్యూయర్షిప్ ఉన్న టాప్ 50 వీడియోల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఛానెల్ క్రియేట్ చేసిన రికార్డులు కూడా చాలానే ఉన్నాయి.
ఎనిమిదేండ్ల లోపు పిల్లల కోసం..
ఛానెల్ పెట్టిన మొదట్లో నాలుగేండ్ల పిల్లల కోసమే వీడియోలు చేసేవాళ్లు. తర్వాత ఎనిమిదేండ్ల పిల్లల కోసం కూడా చేస్తున్నారు. వాళ్ల కోసం లాలిపాటలు, రైమ్స్, కిడ్స్ సాంగ్స్ అప్‌లోడ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ కేటగిరీ కంటెంట్‌ని చాలా దేశాల్లో యూట్యూబ్ ఛానెల్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇండియాలో ఇలాంటి ఛానెల్స్ చాలానే ఉన్నాయి. అయినా.. చుచు టీవీ పోటీని నిలదొక్కుకుని సక్సెస్ అయింది. దీనికి కారణం.. చుచు టీవీలో స్టోరీ చెప్పే విధానం, యానిమేషన్, మ్యూజిక్ బాగుండటమే. ఛానెల్ పెట్టినప్పటి నుంచి డెవలప్ అవుతూనే ఉంది. ప్రస్తుతం చుచు టీవీ కోసం చెన్నైలో పెద్ద బిల్డింగ్‌లో స్టూడియోను ఏర్పాటు చేశారు. ప్రతి నెల కోట్లలో సంపాదిస్తున్నారు.