పోలీస్ స్టేషన్ లో లంచం.. ఏసీబీ అదుపులో ముగ్గురు

పోలీస్ స్టేషన్ లో లంచం.. ఏసీబీ అదుపులో ముగ్గురు

రాజన్నసిరిసిల్ల, వెలుగు:రూ. పది వేలు లంచం తీసుకుంటూ గంభీరావుపేట పోలీస్​స్టేషన్ ​రైటర్ ​పట్టుబడగా.. ఎల్లారెడ్డిపేట సీఐ లింగమూర్తి, గంభీరావుపేట ఎస్సై అనిల్​కు దీంతో సంబంధం ఉందంటూ ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఇసుక రవాణాదారుడు సింహాచలం పోలీసుల తనిఖీల్లో మినీ టిప్పర్​తో డిసెంబర్​19న పట్టుబడ్డాడు. టిప్పర్​ సీజ్ ​చేసి కేసు నమోదు చేశారు. రిలీజ్​ ఆర్డర్​ కోసం రూ.25 వేలు అడగడంతో రూ.10 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పథకం ప్రకారం సింహాచలంతో రూ.10 వేలు ఇప్పించారు. ఈ డబ్బులు నేరుగా రైటర్​కనకరాజు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం ఎస్సై అనిల్​ను అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లలో ఉన్న సీఐ లింగమూర్తిని సైతం ఏసీబీ  అధికారులు కారులో ఎక్కించుకొని గంభీరావుపేటకు తీసుకువచ్చి విచారణ జరిపారు. వీరిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.

ఫస్ట్​ పోస్టింగ్‌.. డ్యూటీలో చేరిన నెలన్నరకే..

గంభీరావుపేట ఎస్సై అనిల్​ఇటీవలే ప్రొబేషన్​పూర్తి చేసుకున్నారు. నెలన్నర క్రితం గంభీరావుపేటలో ఫస్ట్​ పోస్టింగ్​వచ్చింది. ప్రొబేషన్​టైంలో తన పనితీరుతో ఎస్పీ చేతులమీదుగా అవార్డు సైతం అందుకున్నారు. ఇప్పుడు ఏసీబీ కేసులో చిక్కుకున్నారు.