ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌తో అంగన్‌‌‌‌వాడీల్లో అవకతవకలకు చెక్​

ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌తో అంగన్‌‌‌‌వాడీల్లో అవకతవకలకు చెక్​
  •     ప్రతి రోజు పిల్లల హాజరు, పౌష్టికాహారంపై రిపోర్ట్​
  •     పనిభారం పెరుగుతుందని వ్యతిరేకిస్తున్న అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలు 
  •     గ్రామాల్లో టెక్నికల్​ప్రాబ్లమ్స్​ వస్తాయంటున్న అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలు

నిర్మల్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లలో అవకతవకలు నిరోధించడంపై సర్కార్​నజర్ పెట్టింది. ఇందుకోసం న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌టీఎస్) అనే విధానాన్ని అమలు చేస్తోంది. అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు, ఆయాల హాజరుతోపాటు సెంటర్ల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేస్తున్న పోషకాహారం వివరాలు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఎంటర్​చేస్తారు. దీనిద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే అవకాశం ఏర్పడింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 926 అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో 62 వేల 688 మంది పిల్లలు ఉన్నారు. వీరితోపాటు సెంటర్ల పరిధిలో  6,597 మంది గర్భిణులు, 6,154 మంది బాలింతలు రిజిస్టరై ఉన్నారు. వీరందరికీ ప్రతిరోజు అంగన్​వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. 

ప్రత్యేక యాప్‌‌‌‌‌‌‌‌తో వివరాల నమోదు 

న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం పేరిట ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసి యాప్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్​ చేయించారు. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు సిబ్బంది హాజరుతో పాటు అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంతమంది పిల్లలు హాజరయ్యారు.. వారితోపాటు గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసిన పౌష్టికాహారం వివరాలను యాప్​లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో ఏరోజుకారోజు సెంటర్లలో స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు ఆఫీస్‌‌‌‌‌‌‌‌తోపాటు రాష్ట్ర స్థాయి అధికారులకు తెలుస్తుంది. గతంలో అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలు ప్రతినెలా చివరలో మ్యానువల్ గా ఈ రిపోర్టులు ఐసీడీఎస్​అధికారులకు సమర్పించేవారు.

అయితే ఈ రిపోర్టుల్లో స్టాక్​వివరాలు తప్పుగా నమోదు చేసేవారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ తప్పుడు వ్యవహారాలపై ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌టీఎస్ ద్వారా చెక్​పెట్టేందుకు ప్రతిరోజు ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఆర్​(ఫుడ్ కన్సల్టేషన్ రిపోర్ట్) ను ఆన్​లైన్​లో అడుగుతున్నారు. అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ వర్కర్లు పిల్లల హాజరు, గర్భిణులు, బాలింతలకు అందించిన పౌష్టికాహారం పంపిణీ వివరాలను ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిపోర్ట్​తయారు చేసి మానిటరింగ్​సెల్‌‌‌‌‌‌‌‌కు పంపాల్సి ఉంటుంది. దీంతో ఎప్పటికప్పుడు పౌష్టికాహారం పంపిణీపై వివరాలు తెలుస్తాయి. 

అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సిబ్బంది  అభ్యంతరం 

జనవరి 1 నుంచి అమలవుతున్న ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌టీఎస్​విధానంపై అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఫుడ్ కన్సల్టేషన్ రిపోర్ట్ ను తయారు చేయాలంటే చాలా టైం తీసుకుంటుందంటున్నారు. కొన్ని గ్రామాల్లో సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్​ సిగ్నల్స్​ ఉండవని, దీంతో ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఆర్​రిపోర్ట్​తయారీకి ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. వెంటనే ఈ విధానాన్ని తొలగించి మాన్యువల్‌‌‌‌‌‌‌‌గానే నివేదికలు పంపేందుకు అనుమతించాలని కోరుతున్నారు.

ఇప్పటికే భూషణ్ అభియాన్ యాప్‌‌‌‌‌‌‌‌లో అన్ని వివరాలు నమోదు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మళ్లీ ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌టీఎస్ను అమలుచేయడం వల్ల తమపై పని ఒత్తిడి పెరుగుతుందని వాపోతున్నారు. ప్రతిరోజు పౌష్టికాహార పంపిణీ వివరాలతోపాటు పిల్లల గ్రోత్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్, డిజిటల్ రిజిస్టర్ల నిర్వహణ, రియల్ టైం డాటా ను అమలు చేయడం లాంటి వివరాలు నమోదు చేయాలంటే తమకు తలకు మించిన భారంగా మారుతుందంటున్నారు. 

పకడ్బందీగా  ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఆర్

పిల్లల హాజరు లెక్కల వివరాలు, పౌష్టికాహారం స్టాక్  వివరాలు ప్రతిరోజు నమోదు చేసేలా ఫుడ్ ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఆర్​ రూపొందించారు. దీని ప్రకారం లబ్ధిదారులకు అందే బియ్యం, కోడిగుడ్లు, పప్పు, పాలు, నూనె, బాలామృతం, మురుకులు లాంటి స్టాక్ వివరాలను ప్రతిరోజు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలతో పాటు అదనంగా అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలలోని పిల్లల గ్రోత్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్, గర్భిణులు, బాలింతల ఆరోగ్య స్థితిగతుల వివరాలను ఈ యాప్ లో ప్రతిరోజు నమోదు చేయాలి. డిజిటల్ రిజిస్టర్ల మెయింటనెన్స్‌‌‌‌‌‌‌‌తోపాటు రియల్ టైం డాటాను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. 

యాప్​ వినియోగం ఇబ్బందిగా ఉంటుంది

ఇప్పటికే పోషణ్ అభియాన్ యాప్ ద్వారా అన్ని వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేస్తున్నాం. మళ్ళీ ప్రభుత్వం ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌టీఎస్​పేరిట మరో యాప్ ను ప్రవేశపెట్టి ప్రతిరోజూ ఫుడ్ కన్సల్టేషన్ రిపోర్ట్స్​తయారుచేయమనడం సరికాదు. దీనివల్ల తమపై పనిఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలు బీఎల్‌‌‌‌‌‌‌‌వో డ్యూటీలు చేస్తున్నారు. ఇలా రోజుకో కొత్త రిపోర్టును తయారు చేయమనడం పనిభారంతోపాటు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నాం. ప్రభుత్వం ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌ను నిలిపివేయాలి. - లలిత, ప్రధాన కార్యదర్శి, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ ఉద్యోగుల సంఘం, నిర్మల్ జిల్లా

అవకతవకలకు చెక్​పెట్టేందుకే... 

అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్ల నిర్వహణలో పారదర్శకత కోసమే ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌టీఎస్ ​విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనిద్వారా సెంటర్లలో అవకతవకలకు చెక్​పెట్టే అవకాశం ఉంది. అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ ఉద్యోగులు ప్రతిరోజు ఫుడ్ కన్సల్టేషన్ రిపోర్టులు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనిద్వారా పంపిణీ అయిన పౌష్టికాహారం, మిగిలిన స్టాక్​ వివరాలు తెలుస్తాయి. జనవరి నుంచి మరింత పకడ్బందీగా ఈ విధానం అమలు కానుంది. -విజయలక్ష్మి,  జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి, నిర్మల్