సిటిజన్ షిప్ వ్యతిరేక ఆందోళనపై హైకోర్టులకెళ్లండి

సిటిజన్ షిప్ వ్యతిరేక ఆందోళనపై హైకోర్టులకెళ్లండి

న్యూఢిల్లీ: సిటిజన్ షిప్ ఎమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ)కు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులకు వెళ్లాలని పిటిషనర్లకు సూచించింది. చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే ఆధ్వర్యంలోని జస్టిస్ లు బీఆర్ గవాయ్, సూర్యకాంత్ లతో కూడిన బెంచ్ మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.  స్టూడెంట్లపై విచక్షణ రహితంగా లాఠీ చార్జి చేసి అరెస్టు చేశారని, వారికి  సరైన ట్రీట్ మెంట్ కూడా అందించట్లేదని పిటిషనర్లు బెంచ్ కు తెలిపారు. కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ..  ఏ ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఇద్దరు స్టూడెంట్లు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నట్లు చెప్పారు. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ వాదించారు. రెండు వర్గాల వాదనలు విన్న బెంచ్.. ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టులకు వెళ్లాలని పిటిషనర్లకు  సూచించింది.

మైనారిటీ స్టేటస్ పై పిటిషన్ కొట్టివేత

దేశంలోని ఐదు కమ్యూనిటీలకు మైనారిటీ హోదా కల్పిస్తూ ఇంతకు ముందు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ దాఖలైన పిల్ ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీ లను మైనారిటీలుగా గుర్తిస్తూ 26 ఏళ్ల కిందట కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని బీజేపీ లీడర్, లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన సుప్రీంకోర్టులో సవాలు చేశారు.