
- కార్పొరేట్ సమావేశాలు, ఇన్సెంటివ్ ట్రిప్స్, జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు, ట్రేడ్ షోలకు ప్రత్యేక వేదిక
- ప్రముఖ హోటల్స్ తరహాలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం
- అధునాతన సదుపాయాలు కల్పించేలా ప్లాన్
- హైదరాబాద్‌లో స్థల సేకరణలో అధికారులు నిమగ్నం
- మైస్ టూరిజంపై పర్యాటక శాఖ ఫోకస్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరం జాతీయ, అంతర్జాతీయ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. బిజినెస్ మీటింగ్స్, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్లు, ట్రేడ్ షోలు, ప్రాపర్టీ షోలు వంటి కార్యక్రమాలకు అత్యాధునిక వేదికలను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మైస్ (మీటింగ్స్, ఇన్సెంటీవ్స్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్స్) కోసం ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.
అయితే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవాతోపాటు హైదరాబాద్ వంటి నగరాలు మైస్ టూరిజానికి కేరాఫ్‌గా నిలుస్తుండగా.. ఈ నగరాల్లో ప్రైవేట్ స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్‌లోనే బిజినెస్‌కు సంబంధించి మీటింగ్స్, ఈవెంట్స్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రముఖ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా వెలుగొందుతున్న హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా కన్వెన్షన్ సెంటర్ లేదా హోటల్ నిర్మించాలని భావిస్తోంది. హెచ్ఐసీసీ, నోవాటెల్, ట్రెడెంట్, ఐటీసీ కోహినూర్ హోటల్స్ తరహాలో టూరిజం శాఖ తరఫున నిర్మించేలా కార్యాచరణ రూపొందించింది.
ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ సెంటర్‌ను నిర్మించడంతో పాటు అధునాతన సదుపాయాలు కల్పించనున్నది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఈ వేదికను ఏర్పాటు చేసేందుకు ఆయా ప్రాంతాల్లో అధికారులు స్థల సేకరణలో నిమగ్నమయ్యారు.
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు, బిజినెజ్ టూరిజంలో హైదరాబాద్‌ను నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు పర్యాటక ప్రణాళికలు రూపొందించింది. రాబోయే ఐదేండ్లలో పర్యాటక రంగానికి రూ.15 వేల కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యం నిర్దేశించుకున్నది. ఇందులో భాగంగా మెడికల్, కస్టమైజ్డ్, ఫిలిం, మైస్ టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది.
అయితే, తొలి విడతలో మైస్ టూరిజంపై అధికారులు ఫోకస్ పెట్టారు. దేశ, విదేశీ వ్యాపార కార్పొరేట్ సమావేశాలు, బోర్డ్ మీటింగ్స్, ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ ట్రిప్స్, జాతీయ, అంతర్జాతీయ సమ్మేళనాలు, వాణిజ్య ప్రదర్శనలు నిర్వహించుకునేలా కన్వెన్షన్ సెంటర్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, ఎగ్జిబిషన్, ట్రేడ్ షో, ప్రాపర్టీ షోలకు వేదిక, కార్పొరేట్ ఈవెంట్ వేదికల నిర్మాణంతో పాటు ఈవెంట్ నిర్వహణ, ప్రత్యేక క్యాటరింగ్ సేవలు అందించేలా ఈ సెంటర్‌ను రూపుదిద్దనున్నారు.
సభలు, సమావేశాలు, ప్రదర్శనలు ఇతర కార్యక్రమాలకు అనుకూలంగా ఉండేలా ‘ఈవెంట్స్ ఇండస్ట్రీ’గా తీర్చిదిద్దనున్నారు. ఈ వేదిక ద్వారా ఈవెంట్ మేనేజ్‌మెంట్లలో ఈవెంట్ ప్లానర్లు, హోటళ్లు, క్యాటరింగ్ సేవలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వ్యాపార సమావేశాల ద్వారా దేశాల మధ్య స్నేహ బంధం చిగురించనున్నది. వ్యాపార పర్యాటకులతో తెలంగాణ టూరిజం ప్రమోషన్‌తో పాటు ఆదాయ వనరులు సమకూరనున్నాయి.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడమే లక్ష్యం
హైదరాబాద్ నగరం బిజినెస్ టూరిజంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి సిటీలతో పోటీ పడుతోంది. కార్పొరేట్ సమావేశాలు, ఇన్సెంటివ్ ట్రిప్స్, జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు, ట్రేడ్ షోలు, సినిమా ఈవెంట్స్ వంటివి నిర్వహించేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయడానికి పర్యాటక శాఖ కృషి చేస్తోంది. మైస్ టూరిజంతో దేశీయ, విదేశీ వ్యాపార సమావేశాలకు హైదరాబాద్ కేరాఫ్‌గా మారనున్నది. దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడనున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగడంతో పాటు ఆదాయ వనరులను సమకూర్చనున్నది. ఈ వేదిక ‘ఈవెంట్స్ ఇండస్ట్రీ’కి కేంద్ర బిందువుగా మారనున్నది
- టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి