గడప దాటని సిటీ ఓటర్లు.. పార్టీలకు, అధికారులకు ఊహించని షాక్​

గడప దాటని సిటీ ఓటర్లు..  పార్టీలకు, అధికారులకు ఊహించని షాక్​
  • 40.23 శాతమే పోలింగ్ నమోదు  
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటువైపనేది సస్పెన్స్  
  • సెలవిచ్చినా ఓటేయకపోవడంతో  రాజకీయవర్గాల్లోనూ చర్చ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో  హైదరాబాద్ సిటీ ఓటర్లు మరోసారి తమ బద్ధకం చూపారు. ఈసారి ఎన్నికల్లో ఓటింగ్​ శాతం పెరుగుతుందని అధికారులు భావించినా ఊహించని విధంగా నమోదైంది. ఎట్టకేలకు పోలింగ్ ముగిసే సమయానికి హైదరాబాద్​పరిధిలో 40.23 శాతం మాత్రమే నమోదైంది. 2018 ఎన్నికల్లో 50.86 శాతం అయితే..ఈసారి ఈసారి దాదాపు 10 శాతం తగ్గడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. గత ఎన్నికలకంటే తక్కువ పోలింగ్​శాతం నమోదవడం గమనార్హం. సిటీలోని పలు స్థానాల్లో పోలింగ్​ తీరును చూస్తే.. చాలామంది అభ్యర్థుల తలరాతలు మారిపోయేలా ఉంది. గురువారం పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దగా కనిపించలేదు. ఉదయం7 గంటల నుంచే  పోలింగ్ మొదలైనా తొలి 2 గంటలు కొంత మందకొడిగా సాగింది. మధ్యాహ్నం పుంజుకుంది. అనంతరం మళ్లీ స్లోగా కొనసాగింది. ఉదయం పోలింగ్​ ప్రారంభమయ్యాకచాలా పోలింగ్ ​బూత్​ల వద్ద ఓట్లు వేసే వారు లేక పోవడంతో వెలవెలబోయాయి. ఓటు హక్కుపై ఎన్నికల సంఘం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని భారీగా ప్రచారం చేశాయి. దీంతో ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని భావించారు. కానీ అందుకు భిన్నంగా సిటీ ఓటర్లు పోలింగ్​బూత్​లకు రావడానికి ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ, ప్రైవేట్​సంస్థలు, వ్యాపార సముదాయాలు సెలవు ప్రకటించినా ఫలితం లేదు.

తక్కువ శాతం దేనికి సంకేతం..?

గ్రేటర్​పరిధిలో పోలింగ్​శాతం భారీగా తగ్గడంపై రాజకీయవర్గాల్లోనూ చర్చ మొదలైంది. ఇంత తక్కువ పోలింగ్​ సిటీలో ఎన్నికల చరిత్రలోనే లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓటర్లను పోలింగ్​బూత్​వరకు తీసుకురాలేకపోవడానికి కారణాలే ఏమిటనే దానిపైనే చర్చ జరుగుతుంది. ఓటు వేసేందుకు ప్రజల్లో ఆసక్తి లేక పోవడం ఒక కారణం కాగా, ప్రభుత్వంపై వ్యతిరేకత మరోకారణమంటూ.. దీంతోనే చాలా మంది ఓటు వేయలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తక్కువ పోలింగ్​ శాతం అధికార పార్టీకి నష్టమా? ప్రతి పక్షపార్టీలకు నష్టమా? అనే దానిపైనా చర్చ నడుస్తుంది. తక్కువ పోలింగ్​జరిగిన ప్రతిసారి అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు రావడమో, లేక తక్కువ మెజార్టీతో విజయం సాధించడమో వస్తుంది. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిందనే వాదన వినిపిస్తుంది. అధికార బీఆర్​ఎస్​పై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమ ఓటు ద్వారా ప్రజలు వెల్లడించారని, దాని ఫలితమే సిటీలో తక్కువ పోలింగ్​శాతం నమోదైందని అంటున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో   సిటీలో 54.18 శాతం నమోదు కాగా కాంగ్రెస్​ కంటే టీడీపీకే ఎక్కువ స్థానాలు వచ్చాయి. 2014 ఎన్నికల్లో 52.9 శాతం ఓటింగ్ అవగా టీఆర్ఎస్​అధికారంలోకి వచ్చింది. 2018 ఎన్నికల్లోనూ 50.86 శాతం మాత్రమే నమోదైంది. దీంతో చాలా సెగ్మెంట్లలో అభ్యర్థులు తక్కువ మెజార్టీతో గెలిచారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా సిటీలో కాంగ్రెస్​కు సీట్ల సంఖ్య పెరిగే చాన్స్ ఉందని  వివిధ సర్వేల్లో స్పష్టమైంది. మొత్తానికి ఈ ఎన్నికల్లో  సిటీ ఓటర్లు అటు పార్టీ అభ్యర్థులకు, ఎన్నికల అధికారులకు ఊహించని షాక్ ​ఇచ్చారు.