సీపీఎం, సీపీఐకి చెరో రెండు సీట్లు!

సీపీఎం, సీపీఐకి  చెరో రెండు సీట్లు!
  •     జాతీయ నేతలు రంగంలోకి దిగడంతో మారిన సీన్ 
  •     చెరో మూడు సీట్లకు ఆయా పార్టీల పట్టు 
  •     త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే చాన్స్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ పార్టీలతో కాంగ్రెస్ పొత్తుపై ఓ క్లారిటీ వచ్చింది. ఆయా పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, మూడేసీ సీట్లు ఇవ్వాలని ఆ రెండు పార్టీలు పట్టుపడుతున్నాయి. త్వరలోనే పొత్తులపై ఇరు పార్టీల నుంచి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశముంది. స్థానాలపై క్లారిటీ వచ్చిన తర్వాతే పొత్తులపై ప్రకటనలు చేయాలని లెఫ్ట్ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, స్క్రీనింగ్ ప్రక్రియ కొననసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఎం, సీపీఐతో పొత్తుపైనా కాంగ్రెస్ దృష్టి పెట్టింది.

ALSO READ  :- ఎమ్మెల్యేలకు నిరసన సెగ.. డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లపై నిలదీత

 తెలంగాణలో ఈ సారి ఎలాగైనా గెలవాలనే భావనతో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని పార్టీ హైకమాండ్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ద్వారా సీపీఎం, సీపీఐ బలాబాలాలపై సర్వే చేయించినట్టు తెలిసింది. సర్వేలో లెఫ్ట్ పార్టీల ప్రభావం కలిసి వస్తుందనే రిపోర్టు కూడా వచ్చినట్టు తెలిసింది. దీంతో లెఫ్ట్ తో పొత్తుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీఆర్ఎస్ తో పొత్తు చెడిన సమయంలో నేరుగా ఏఐసీసీ నేతలే  రంగంలోకి దిగి సీపీఎం, సీపీఐ నేతలతో మాట్లాడి ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని సూచించారు. తాజాగా భట్టి విక్రమార్క ఇరు లెఫ్ట్ పార్టీల నేతలతో చర్చించి, అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.  

ఢిల్లీ స్థాయిలోనే చర్చలు 

కాంగ్రెస్ తో సీపీఎం, సీపీఐ పొత్తుపై జాతీయ స్థాయిలోనే చర్చలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్ తో  లెఫ్ట్ పార్టీల జాతీయ నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, నారాయణ చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ క్రమంలో సీపీఎం, సీపీఐకి చెరో రెండు స్థానాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సీపీఎంకు మిర్యాలగూడ, పాలేరు.. సీపీఐకి మనుగోడు, హుస్నాబాద్/ బెల్లంపల్లి స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చెప్తున్నారు. అయితే, భద్రాచలం స్థానం కోసం సీపీఎం, కొత్తగూడెం కోసం సీపీఐ పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిసింది. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తంచేసినట్లు సమాచారం. 

సీపీఎం రాష్ట్ర కమిటీలో చర్చ 

కాంగ్రెస్​తో పొత్తుపై సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలోనూ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం తదితరుల మధ్య చర్చ జరిగింది. కాంగ్రెస్​తో కలిసి పోటీ చేసేందుకు రాష్ట్ర కమిటీ అంగీకారం తెలిపినట్టు తెలిసింది. అయితే భద్రాచలం స్థానాన్ని మాత్రం వదులుకోవద్దని పలువురు నేతలకు సూచించినట్టు సమాచారం. కాగా, సీపీఐ రాష్ట్ర కమిటీలోనూ కాంగ్రెస్​తో పొత్తుపై చర్చించనున్నారు.