వాగోడుగూడెంలో పోడురైతులు, ఫారెస్ట్​ఆఫీసర్ల మధ్య వివాదం

వాగోడుగూడెంలో పోడురైతులు, ఫారెస్ట్​ఆఫీసర్ల మధ్య వివాదం

అశ్వారావుపేట, వెలుగు: ఫారెస్ట్​ఆఫీసర్లు, పోడురైతుల మధ్య జరిగిన తోపులాటలో ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వాగోడుగూడెం గ్రామంలో పోడురైతులు, ఫారెస్ట్​ఆఫీసర్ల మధ్య రెండు రోజులుగా వివాదం నెలకొంది. గురువారం వంద మందికి పైగా రైతులు పోడు భూముల్లో కంది పంట వేసేందుకు వెళ్లారు. కందులు వేస్తుండగా అక్కడికి చేరుకున్న ఫారెస్ట్​ఆఫీసర్లు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.

పోలీసులు వచ్చి  ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం నడుచుకోవాలని, అనవసరంగా వివాదాలకు పోతే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని ఎస్సై సాయి కిషోర్ రెడ్డి పోడురైతులను హెచ్చరించారు. తమపై ఇప్పటికే ఏడు కేసులు ఉన్నాయని, కేసులకు భయపడి భూములు వదులుకునే ప్రసక్తే లేదని పోడురైతులు తేల్చి చెప్పారు. దాంతో పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు వెనుతిరగడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.