ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

పర్వతగిరి, వెలుగు: గురుకులాల్లో పరిశుభ్రతను పెంచాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్​ఆదేశించారు. ‘స్వచ్ఛ గురుకులం’లో భాగంగా ఆదివారం ఆయన వరంగల్ జిల్లా పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ స్కూల్ ను సందర్శించారు. స్టూడెంట్లు, స్టాఫ్ తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వంట గది, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్ లను పరిశీలించారు. వర్షాల కారణంగా డెంగ్యూ, టైపాయిడ్, మలేరియా, డయేరియా, విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, స్కూల్​ను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఆఫీసర్లు సైతం  స్వచ్ఛ గురుకులంలో భాగస్వాములు కావాలన్నారు.

కార్యకర్తలను కాపాడుకుంటా..

హసన్ పర్తి, వెలుగు: టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​అన్నారు. ఆదివారం వరంగల్ 2వ డివిజన్ వంగపాడు గ్రామంలో 50మంది టీఆర్ఎస్ లో చేరగా, 
వారికి ఎమ్మెల్యే కండువా కప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందన్నారు.

ఉచిత పథకాలపై కేంద్రం కుట్ర

నర్సంపేట, వెలుగు: ఉచిత పథకాలపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు లేఖ రాయడం దారుణమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ హక్కులను కాలరాసేందుకే కేంద్రం ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆదివారం నర్సంపేట టౌన్​లోని సిటిజన్ క్లబ్​లో ఆయన కొత్త పెన్షన్లు పంపిణీ చేశారు. విభజన హామీలను కేంద్రం నేటికీ నెరవేర్చలేదన్నారు. త్వరలోనే సొంత జాగలు ఉన్నవారికి ఇండ్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల సాయం చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి కేటీఆర్ నర్సంపేటకు ప్రకటించిన రూ.50 కోట్ల నిధులు త్వరలోనే విడుదల అవుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్ తదితరులున్నారు..

దళితులను దగా చేస్తున్న సీఎం

చిట్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ దళితులను దగా చేస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి ఆరోపించారు. ఆదివారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో పార్టీ కార్యకర్తలతో ఆయన మీటింగ్ నిర్వహించారు. దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు అన్నీ మోసాలే చేశారని మండిపడ్డారు. మూడెకరాల భూమి కూడా పత్తా లేకుండా పోయిందన్నారు. టీఆర్ఎస్ లీడర్లకే దళితబంధు అందుతోందని, పేదలకు మొండిచేయి చూపుతున్నారని విమర్శించారు. దళితులంతా ఏకమై కేసీఆర్ ను ఓడించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేశ్​గౌడ్, ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడు రత్న రమేశ్ తదితరులున్నారు.

ఎమ్మెల్యే వస్తుండని.. మధ్యలోనే మీటింగ్ క్లోజ్

సాదాసీదాగా పర్వతగిరి జనరల్ బాడీ మీటింగ్

పర్వతగిరి, వెలుగు: మూడు నెలల కోసం జరిగే జనరల్ బాడీ మీటింగ్ కు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు చాలావరకు డుమ్మా కొట్టారు. ఆదివారం వరంగల్ జిల్లా పర్వతగిరిలో మీటింగ్ నిర్వహించగా.. కొందరు మాత్రమే హాజరయ్యారు. దీంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఎంపీపీ కమల అధ్యక్షతన మీటింగ్ జరగగా.. వైస్ ఎంపీపీ రాజేశ్వర్ రావు, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఉదయం 11గంటలకు ప్రారంభం కావాల్సిన మీటింగ్ 12గంటలకు మొదలైంది, సమస్యలు చర్చిస్తుండగానే.. మధ్యలోనే మీటింగ్ క్లోజ్ చేశారు. మండలంలోని ఓ సర్పంచ్ కూతురు ఫంక్షన్ ను ఎమ్మెల్యే అరూరి రమేశ్ వస్తున్నారని తెలుసుకుని మీటింగ్ ముగించారు. స్టూడెంట్లకు సర్టిఫికేట్లు రావడం లేదని, రేషన్ డీలర్లు లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని, పీహెచ్​సీలో ఇద్దరు స్టాఫ్ నర్సులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు.

సమైక్యత వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలి

పాలకుర్తి, వెలుగు: ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సిబ్బంది ఆదేశించారు. ఆదివారం పాలకుర్తిలోని మంత్రి క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గంలోని వివిధ శాఖల ఆఫీసర్లు, నాయకులతో మీటింగ్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం.. ఈ ప్రోగ్రాంలో అందరూ భాగస్వాములయ్యేలా ప్రణాళిక 
రూపొందించాలన్నారు. 16న పాలకుర్తిలో 30వేల మందితో జాతీయ సమైక్యత సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. 17న హైదరాబాద్​లో నిర్వహించే గిరిజన ర్యాలీకి నియోజకవర్గం నుంచి ఐదు లక్షల మందిని తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని పార్టీ లీడర్లకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య తదితరులున్నారు. అనంతరం స్థానిక హైస్కూల్​లో మిత్ర హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఫ్రీ మెడికల్ క్యాంప్ ను మంత్రి ప్రారంభించారు.

స్టూడెంట్లను ఆగంజేస్తున్న కేసీఆర్

పరకాల, వెలుగు: గురుకుల స్టూడెంట్లను సీఎం కేసీఆర్​ ఆగం చేస్తున్నారని బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్​చార్జి డాక్టర్​ పెసరు విజయచందర్​రెడ్డి ఆరోపించారు. ఆదివారం బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడం లేదన్నారు. బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడతకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాచం గురుప్రసాద్, జిల్లా కార్యదర్శి ఎర్రం రామన్న, కౌన్సిలర్లు బెజ్జంకి పూర్ణచారి,  నాయకులు పాల్గొన్నారు.

కేసీఆర్ వస్తే దేశంలోని దళితులందరికీ దళితబంధు

సోషల్ మీడియా మీటింగ్ లో ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: కేంద్రంలో కేసీఆర్ అధికారంలోకి వస్తే దేశంలోని దళితులందరికీ దళిత బంధు అమలు చేస్తారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం నియోజకవర్గకేంద్రంలో నిర్వహించిన పార్టీ సోషల్ మీడియా మీటింగ్ కు ఆయన హాజరై మాట్లాడారు. దరఖాస్తు, దస్కత్ లేకుండా రాష్ట్రంలో దళితబంధు అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ లీడర్ సుభాశ్ ​అనే వ్యక్తి తనపై విష ప్రచారం చేస్తున్నాడని, ఆయనకు టీఆర్ఎస్ కార్యకర్తల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోందని, వాటిని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. సీఎం కేసీఆర్​ మనసున్న మహారాజు అని, పేదల సమున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే బీజేపీ ఓర్వడం లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్​రెడ్డి, టీఆర్ఎస్ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ మారెపల్లి ప్రసాద్, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, సతీశ్ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు చాడ సరిత, బొల్లం అజయ్, ఇల్లందుల బేబీ శ్రీనివాస్, కందుకూరి రేఖ గట్టయ్య, బొమ్మిశెట్టి సరిత తదితరులున్నారు.

కార్పొరేట్ కు దీటుగా గురుకుల విద్య

జనగామ, వెలుగు: కార్పొరేట్ సంస్థలకు దీటుగా గురుకులాల్లో విద్యాబోధన జరుగుతోందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ రెసిడెన్షియల్ ఉమెన్స్ కాలేజీలో.. స్వచ్ఛ గురుకులం ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గురుకులాల్లోని ఒక్కో స్టూడెంట్​కు ప్రభుత్వం ఏడాదికి రూ.1.25లక్షలు ఖర్చు చేస్తోందన్నారు. త్వరలోనే ఈ కాలేజీలో స్ట్రీట్ లైట్లు వేయిస్తామన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్లకు ప్రైజ్ లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్​పర్సన్ పోకల జమున, కౌన్సిలర్ వంకుడోత్ అనిత, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు లోన్లు ఇవ్వాలని వినాయకుడికి వినతిపత్రం

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులకు లోన్లు అందజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ నాయకులు శంతన్ రామరాజు విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ప్రసాదించాలని ఆదివారం ఆయన పట్టణంలోని శనిగపురంలో వినాయక విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి, వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏటా బడ్జెట్​లో బీసీలకు నిధులు కేటాయిస్తున్నా.. అందులో నయాపైసా కూడా రిలీజ్ చేయడం లేదన్నారు. లక్షల మంది లోన్ల కోసం అప్లై చేసుకున్న యువతకు నిరాశే మిగిలిందన్నారు.

అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కావాలి

బచ్చన్నపేట, వెలుగు: కేసీఆర్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల13న అసెంబ్లీ ముట్టడికి టీచర్లంతా సిద్ధం కావాలని టీఎస్​యూటీఎఫ్ జనగామ జిల్లా కార్యదర్శి మడూరి వెంకటేశ్​పిలుపునిచ్చారు. ఆదివారం బచ్చన్నపేటలో టీచర్స్ యూనియన్ లీడర్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు, వీవీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. హైదరాబాద్​లోని ధర్నా చౌక్ వద్ద శాంతియుత దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ ముట్టడికి టీచర్లంతా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మాడిశెట్టి కృష్ణమూర్తి, బేతి శ్రీధర్, కనకయ్య తదితరులున్నారు.

ఘనంగా వైశ్య ఫెడరేషన్ ప్రమాణస్వీకారం

కాశిబుగ్గ, వెలుగు: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వరంగల్ జిల్లా కమిటీని ఇటీవల ఎన్నుకోగా.. ఆదివారం సిటీలోని ఆర్యవైశ్య భవన్ లో ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. చీఫ్ గెస్టులుగా టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్​ కుమార్ హాజరయ్యారు. ఎన్నికైన కమిటీ సభ్యులు ఫెడరేషన్ అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. అనంతరం 50మంది పేద ఆర్యవైశ్య మహిళలకు కుట్టు మెషిన్లు పంపిణీ చేశారు. పుల్లూరు మధు, తోట హరీశ్, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే..

కాశీబుగ్గ, వెలుగు: బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఇరు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పెద్దరపు రమేశ్​ పిలుపునిచ్చారు. ఆదివారం ఖిలావరంగల్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు నిజాం పాలనపై పోరాడినట్టే.. నేడు భూమి, భుక్తి కోసం మళ్లీ పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణలో మతోన్మాద చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇరు పార్టీలు ప్రజలను మోసం చేశాయన్నారు.

చెట్టును ఢీకొన్న కారు

భార్యాభర్తలకు గాయాలు

పర్వతగిరి(ఐనవోలు), వెలుగు: ఓవైపు వర్షం, మరోవైపు రోడ్డుపై గుంతలు, ఇంకోవైపు ఓవర్ స్పీడ్ తో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న భర్తకు, పక్కన కూర్చున్న భార్యకు తీవ్ర గాయాలు కాగా, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన కె.పరుశురాం, అతని భార్య జయ, కూతురు సుదీక్షతో కలిసి ఆదివారం కాజీపేటలో ఓ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని సమీపంలోకి రాగానే రోడ్డుపై గుంతలు ఉండడం, దీనికి తోడు వాన రావడంతో కారు స్టీరింగ్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దీంతో పరుశురాంకు కాలు విరగగా, జయకు కాలు, చేయి విరిగాయి. కూతురు సుదీక్ష స్వల్ప గాయాలతో బయటపడింది.

వర్షంలో రోడ్డు దాటుతుండగా..    లారీ ఢీకొని వ్యక్తి మృతి

రేగొండ(గణపురం), వెలుగు: వర్షంలో గొడుగు పట్టుకుని రోడ్డు దాటుతుండగా.. లారీ ఢీకొట్టి ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ విషాద సంఘటన జయశంకర్​భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దల్బంజన్ రాజు(35) శనివారం రాత్రి పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. వాన పడుతుండడంతో గొడుగు పట్టుకుని రోడ్డు దాటుతున్నాడు. ఈక్రమంలో పరకాల నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి రాజును ఢీకొట్టింది. 108 ద్వారా వరంగల్​ ఎంజీఎంకు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.