
ముంబై: స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం కొద్దిపాటి నష్టాలతో ముగిశాయి. గురువారం సెషన్‌లో భారీ ర్యాలీ చేసిన ఐటీ షేర్లు, భారతి ఎయిర్‌టెల్‌లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 30-షేర్ల సెన్సెక్స్ 200.15 పాయింట్లు లేదా 0.24 శాతం తగ్గి 82,330.59 వద్ద సెటిల్ అయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42.30 పాయింట్లు లేదా 0.17 శాతం నష్టపోయి 25,019.80 వద్ద ముగిసింది.
భారతి ఎయిర్‌టెల్‌లోని తన వాటాలో 1.2 శాతాన్ని సింగ్‌టెల్ అమ్మింది. దీంతో ఎయిర్‌టెల్ షేర్లు శుక్రవారం 2.81 శాతం పడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి.
మరోవైపు ఎటర్నల్, హిందుస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. వారం మొత్తం చూస్తే , సెన్సెక్స్ 2,876.12 పాయింట్లు లేదా 3.61 శాతం, నిఫ్టీ 1,011.8 పాయింట్లు లేదా 4.21 శాతం పెరిగాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్‌ఎస్‌ఈ కాంపోజిట్, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ మార్కెట్లు నష్టాల్లో కదిలాయి. సౌత్ కొరియా కోస్పి పాజిటివ్‌లో ముగిసింది. యూరోపియన్ మార్కెట్స్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 64.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
కొనసాగుతున్న డిఫెన్స్ షేర్ల ర్యాలీ
డిఫెన్స్ సంబంధిత కంపెనీల షేర్లు, డ్రోన్ తయారీదారులు, మిసైల్స్, సంబంధిత సామగ్రి తయారీ కంపెనీల షేర్లు శుక్రవారం కూడా ర్యాలీ చేశాయి. బీఎస్‌ఈలో పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ షేర్లు 18.90 శాతం, డేటా ప్యాటర్న్స్ 9.25 శాతం, ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ 7.10 శాతం, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 5.40 శాతం, మిశ్ర ధాతు నిగమ్ 4.63 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 3.87 శాతం, భారత్ డైనమిక్స్ 1.95 శాతం పెరిగాయి. డ్రోన్ తయారీ కంపెనీల్లో డ్రోన్‌ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ షేర్లు 2 శాతం లాభపడ్డాయి. డిఫెన్స్ స్టాక్స్ గత ఐదు సెషన్లలో కూడా లాభాల్లోనే కదిలాయి.