- బడుల ప్రారంభంపై ఏం నిర్ణయం తీసుకున్నరు?
- సమ్మక్క జాతరకు చేస్తున్న ఏర్పాట్లేంటి?
- వీకెండ్ మార్కెట్లలో తీసుకుంటున్న చర్యలేంటి?
- పిల్లలకు కరోనా ట్రీట్ మెంట్ పై రిపోర్టు ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఓవైపు యూనివర్సిటీలు, హాస్టళ్లు మూసేస్తూ.. మరోవైపు స్కూళ్లను ఎలా తెరుస్తారని రాష్ట్ర సర్కార్ ను హైకోర్టు ప్రశ్నించింది. కరోనా కేసులు పెరుగుతున్న టైమ్ లో బడులను ప్రారంభించాలని ఎలా భావిస్తారని అడిగింది. బడులను తిరిగి ప్రారంభించడంపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాపై ఫైల్ అయిన పిల్స్ పై హైకోర్టు శుక్రవారం మరోసారి ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు లాయర్లు ఎల్.రవిచందర్, చిక్కుడు ప్రభాకర్, మయూర్ రెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. యూనివర్సిటీలు, హాస్టళ్లను మూసేస్తున్న ప్రభుత్వం.. ఈ నెలాఖరు తర్వాత స్కూళ్లను ఓపెన్ చేయాలని నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయని హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు పైవిధంగా స్పందించింది. అయితే బడుల ప్రారంభంపై సర్కార్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరఫు లాయర్ చెప్పారు.
వీకెండ్ మార్కెట్లను మూసెయ్యలేం...
‘‘రాష్ట్రంలో జరిగే సమ్మక్క, సారక్క జాతరకు 75 లక్షల మంది వరకు భక్తులు వస్తారు. మరి అంత పెద్ద జాతరలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందో తెలియడం లేదు. గతంలో కుంభమేళాలో కట్టడి చర్యలు తీసుకోకపోవడం వల్ల సాధువులకు కరోనా వచ్చింది. ఇప్పుడు జాతరలో అలాంటి పరిస్థితి రాకుండా చూడాలి” అని లాయర్లు హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు... జాతరలో కరోనా గైడ్ లైన్స్ ఎలా అమలు చేస్తారో చెప్పాలని సర్కార్ ను ప్రశ్నించింది. అక్కడ చేస్తున్న ఏర్పాట్లపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. కాగా, వీకెండ్ మార్కెట్లలో కరోనా వ్యాప్తి చెందుతోందని, వాటి విషయంలో ఉత్తర్వులు ఇవ్వాలని లాయర్లు కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. ‘‘వీకెండ్ మార్కెట్లను మూసేస్తే పేదలు ఏం కావాలి? వాళ్లు రోజుకో వంద సంపాదించి, కుటుంబాన్ని పోషించుకుంటారు. వాళ్ల జీవనాన్ని అడ్డుకోలేం” అని చెప్పింది. వీకెండ్ మార్కెట్లలో కరోనా నియంత్రణ చర్యలపై రిపోర్టు ఇవ్వాలని సర్కార్ ను ఆదేశించింది. ఆస్పత్రుల్లో సౌలతులపై, పిల్లలకు అందజేస్తున్న ట్రీట్ మెంట్ పై, కేంద్ర గైడ్ లైన్స్ అమలుపైనా నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ... విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.
పిల్లలకు కరోనా వస్తలేదు: డీహెచ్
పిల్లలకు కరోనా రావడం లేదని హైకోర్టుకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో ఒక్క పిల్లాడే చేరాడని, నిలోఫర్‌లోనూ పిల్లల చేరికలు తక్కువగానే ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ అన్ని ఆస్పత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా బెడ్స్ కేటాయించామన్నారు. 1,875 ఐసీయూ బెడ్స్, 6 వేల సాధారణ బెడ్స్ అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 77 లక్షల ఇళ్లల్లో ఫీవర్ సర్వే చేశామని, 3.45 లక్షల కిట్లను పంపిణీ చేశామని వెల్లడించారు.
