కాళేశ్వరం నీటితో పంటలు పండటం లేదు : మల్లు భట్టి విక్రమార్క

కాళేశ్వరం నీటితో పంటలు పండటం లేదు : మల్లు భట్టి విక్రమార్క

దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తామని కరీంనగర్ వేదిక నుంచే సోనియాగాంధీ హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. పోరాటాల కరీంనగర్ గడ్డ నుంచే రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడిందన్నారు. తెలంగాణ వచ్చినా నిధులు మాయమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.18 లక్షల కోట్ల బడ్జెట్ లో రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసినా మిగతా నిధులన్నీ మాయమయ్యాయని ఆరోపించారు. 


అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అంబేద్కర్ పేరు ఉండకూడదనే కాళేశ్వరం పేరు పెట్టారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కాళేశ్వరం నీటితో పంటలు పండటం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తాము కట్టిన ప్రాజెక్టుల  వల్లే సాగునీరు వస్తోందన్నారు. ఛత్తీస్‌గఢ్ లో మహిళలకు స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత ఇస్తోందని చెప్పారు. చివరకు పేడను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తెలంగాణ  రాష్ట్రంలో లేవన్నారు. హాథ్ సే హాథ్ జోడో స్ఫూర్తిని ఇంటింటికి తీసుకెళ్లాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతుల కోసం రాయపూర్ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం కాబోతుందని చెప్పారు. 

కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సభకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ హాజరయ్యారు. ఇటు రాష్ట్రం నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గడ్డం వినోద్,  కొండా సురేఖ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, కోదండరెడ్డి ఇతర నేతలు హాజరయ్యారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, కొప్పుల రాజు, మాణిక్ రావు ఠాక్రే,  సురేశ్ షెట్కార్ పాల్గొన్నారు. ఈ సభలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాట పడి కాంగ్రెస్ శ్రేణులను అలరించారు.