రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించండి

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించండి
  • రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించండి
  • టీఆర్​ఎస్​ ఎంపీలకు సీఎం కేసీఆర్​ సూచన
  • పొగడ్తలు తప్ప రాష్ట్రపతి స్పీచ్‌‌లో ఏముంటయ్‌‌?
  • మనం పార్లమెంట్‌‌లో లొల్లి చేస్తే దేశం దద్దరిల్లాలె
  • కేసీఆర్‌‌ ఏం చేస్తడో.. చేయగలడో మోడీకి తెలుసు
  • రాష్ట్రానికి రావాల్సిన వాటిపై నిలదీయాలని ఆదేశం
  • 23 అంశాలతో ఎంపీలకు నోట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  బీజేపీపై పోరులో తగ్గేదేలేదని సీఎం కేసీఆర్‌‌ తేల్చిచెప్పారు. పార్లమెంట్​బడ్జెట్​ సమావేశాల్లో దూకుడుగా ముందుకు వెళ్లాలని టీఆర్​ఎస్​ ఎంపీలను ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్‌‌లో నిర్వహించిన టీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌‌ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని పార్టీ ఎంపీలను ఆదేశించినట్టు తెలిసింది. ‘‘ప్రెసిడెంట్‌‌ స్పీచ్‌‌లో పొగడ్తలు తప్ప ఇంకేముంటయ్​.  ఏడేండ్ల నుంచి వింటున్నం.. ఇప్పుడు విన్నా అదే ఉంటది.. అందుకే మొదటి రోజు పార్టీ ఎంపీలెవరూ పార్లమెంట్‌‌కు వెళ్లొద్దు’’ అని ఆయన అన్నట్లు సమాచారం. రాష్ట్రానికి నిధులు రాబట్టడం, పెండింగ్‌‌ హామీల అమలుకోసం  సంప్రదాయ నిరసనలకు భిన్నంగా వ్యవహరించాలన్నారు. స్పీకర్‌‌ పోడియం ముట్టడి, ప్లకార్డుల ప్రదర్శన అందరూ చేస్తారని.. కానీ అదే టీఆర్‌‌ఎస్‌‌ ఆందోళన చేస్తే దేశం దద్దరిల్లాలని సూచించారు.  తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విద్యాసంస్థలు సహా ఇతర అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలతో కూడిన బుక్‌‌లెట్​ను ఎంపీలకు కేసీఆర్​ అందజేశారు.

మొత్తం 23 అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ‘‘బడ్జెట్‌‌‌‌లో మనకు ఏం దక్కుతుందో చూసిన తర్వాత ఆయా అంశాలపై ఎలాంటి పంథా అనుసరించాలో ఎప్పటికప్పుడు చెప్త. ఆరేండ్లు కేంద్రంతో సఖ్యతతోనే ఉన్నా రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఇకముందు కేంద్రం నుంచి భారీ నిధులు వస్తాయన్న ఆశలు కూడా లేవు. పార్లమెంట్‌‌‌‌ సమావేశాల్లో మనం వ్యవహరించే తీరుతో కేంద్రంతో నోరు తెరిపించి తెలంగాణకు నిధులు ఇవ్వం అనిపించాలి.  కేంద్రం నుంచి అలాంటి ఆన్సర్‌‌‌‌ వచ్చే వరకు దేశం మొత్తం మనవైపే చూసే స్థాయిలో ఉద్యమించాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేసేందుకైనా వెనుకాడొద్దు” అని చెప్పారు. ‘‘కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నోళ్లం.. మనం పోరాటం ఎట్లుంటదో మోడీ సర్కారుకు చూపించాల్సిన టైం వచ్చింది..’’ అని కామెంట్‌‌‌‌ చేసినట్లు తెలిసింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఆశాభంగమే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుందని, అయితే ఆ రాష్ట్రాల ఎన్నికలపై తన సర్వేలు తనకున్నాయని కేసీఆర్​ అన్నారు. బీజేపీ ఆశించినట్టుగా ఫలితాలు ఉండవన్నారు. ఎవరు గెలుస్తారో తాను ఇప్పుడే చెప్పనని, కానీ బీజేపీకి ఆశాభంగం తప్పదన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల ఏకీకరణలో తాను ఏం చేయగలనో మోడీకి తెలుసని, కచ్చితంగా అది చేసి చూపిస్తానని ఆయన అన్నట్టు సమాచారం. గత పార్లమెంట్‌‌‌‌ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు పోరాడుతుంటే మనకు రావాల్సిన మైలేజీ రాకుండా పోయిందన్నారు. మిగతా పార్టీల సోషల్‌‌‌‌ మీడియా మన ఎంపీల ప్రచారాన్ని పలుచన చేసిందని చెప్పారు. సోషల్‌‌‌‌ మీడియాలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చాలా వీక్‌‌‌‌గా ఉందని, దీన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తులను ప్రమోట్‌‌‌‌ చేసుకునేలా కాకుండా పార్టీని ప్రమోట్‌‌‌‌ చేసేలా ఉండాలని చెప్పారు. ‘‘పశ్చిమ బెంగాల్‌‌‌‌, కర్నాటకల్లో దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి సంస్థలను ప్రయోగించినట్టుగానే కేంద్రంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నా మనపై అవే ప్రయోగాలు చేసే చాన్స్​ ఉంది. కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఎదుర్కొనే ధైర్యం ఉంది.  అలాంటి పరిస్థితే వస్తే ఏం చేయాలో నేను చూసుకుంట. ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పోరు కొనసాగించాలి” అని కేసీఆర్​ అన్నట్లు సమాచారం. సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, లోక్‌‌‌‌సభ పక్షనేత నామ నాగేశ్వర్‌‌‌‌రావు, ఎంపీలు పాల్గొన్నారు.

హామీలపై నిలదీస్తం: రంజిత్‌‌‌‌ రెడ్డి

విభజన చట్టంతో పాటు ఇచ్చిన హామీలు అమలు చేసేలా కేంద్రాన్ని నిలదీస్తామని ఎంపీ రంజిత్‌‌‌‌ రెడ్డి అన్నారు. టీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత ప్రగతి భవన్‌‌‌‌ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. 23 అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎంతో పాటు మంత్రులు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారన్నారు. ఈ బడ్జెట్‌‌‌‌లో వాటికి సంబంధించిన కేటాయింపులు ఏమైనా ఉంటాయో లేదో చూసిన తర్వాత వాటిపై స్పందిస్తామన్నారు.