నేను బీజేపీలో చేరితే ఈడీ నోటీసులు ఆగిపోతాయి: కేజ్రీవాల్

నేను బీజేపీలో చేరితే ఈడీ నోటీసులు ఆగిపోతాయి: కేజ్రీవాల్

తాను బీజేపీ పార్టీలో చేరితే.. ఈడీ నోటీసులు ఆగిపోతాయన్నారు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపేతర ప్రభుత్వాలను కూల్చేందుకు, ప్రతిపక్ష నేతలను బెదిరించి పార్టీలో చేర్చుకునేందుకు మోదీ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారాయన. ఎవరైనా లొంగకపోతే వారిపై ఈడీ, సిబిఐ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీలో చేరకపోతే దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతి పక్ష నాయకులను జైలుకు పంపేందుకు బీజేపీ నీచపు రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. బీజేపీలో చేరితే.. అరెస్టైన మనీస్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ లకు మరుసటి రోజే బెయిల్ వస్తుందని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.

కాగా, కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టును ఆశ్రయించింది. లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు పలుమార్లు సమన్లను పంపించినా.. ఆయన విచారణకు రావడంలేదని  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుల అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. కేజ్రీవాల్ విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.  దీంతో ఈడీ ఫిర్యాదుపై విచారించిన  కోర్టు.. కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది. మార్చి 16న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.