మెజారిటీ నిరూపణకు సిద్ధమైన సీఎం సోరెన్

మెజారిటీ నిరూపణకు సిద్ధమైన సీఎం సోరెన్
  • మెజారిటీ నిరూపణకు సిద్ధమైన సీఎం సోరెన్ 
  • రాంచీకి చేరుకున్న రిసార్ట్​లోని ఎమ్మెల్యేలు 

రాంచీ: జార్ఖండ్​లో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో సీఎం హేమంత్ సోరెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నిరూపించుకునేందుకు బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సోమవారం అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించాలని నిర్ణయించారు. బలపరీక్షపై ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీ సెక్రటేరియట్ సమాచారం అందజేసింది. ‘‘రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై మేము గురువారం గవర్నర్ ను కలిస్తే, ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే అసెంబ్లీలోనే తేల్చుకోవాలని, మెజారిటీ నిరూపించుకోవాలని నిర్ణయించాం” అని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఆలంగీర్ ఆలం చెప్పారు. 

ఢిల్లీలో గవర్నర్.. 
సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీజేపీ ఫిర్యాదు చేయగా.. ఎలక్షన్ కమిషన్ విచారణ చేపట్టింది. తన నిర్ణయాన్ని సీల్డ్ కవర్​లో గవర్నర్ రమేశ్ బాయిస్​కు పంపించింది. ఎమెల్యేగా సోరెన్ పై అనర్హత వేటు వేయాలని అందులో సూచించినట్లు తెలిసింది. అయితే గవర్నర్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 1న సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లారు. దీంతో సోరెన్ పై అనర్హత వేటు వేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మెజారిటీ నిరూపించుకునేందుకు సంకీర్ణ ప్రభుత్వం సిద్ధమైంది. 

తిరిగొచ్చిన ఎమ్మెల్యేలు.. 
సోమవారం అసెంబ్లీ సెషన్ ఉండడంతో రాయ్​పూర్​లోని రిసార్టులో ఉన్న జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు ఆదివారం తిరిగొచ్చారు.  ఫ్లైట్​లో 30మంది ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకున్నారు.