రామానుజాచార్యుల కృషి గొప్పది

రామానుజాచార్యుల కృషి గొప్పది
  • రామానుజాచార్యుల కృషి గొప్పది: సీఎం కేసీఆర్
  •  సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలకు సతీ సమేతంగా హాజరు
  • వేడుకల్లో భక్తులకు ప్రసాదం, పండ్లు అందిస్తామని వెల్లడి 
  • రేపు ముచ్చింతల్​కు ప్రధాని మోడీ రాక

హైదరాబాద్, వెలుగు: రామానుజాచార్యుల బోధనలకు తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో గొప్ప విషయమని సీఎం కేసీఆర్​అన్నారు. ప్రపంచానికి సమతా దార్శనికుడైన రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని హైదరాబాద్​లో స్థాపించడం అద్భుతమన్నారు. సమతామూర్తి వేదిక ప్రపంచ ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చుకోనుందని సీఎం తెలిపారు. ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ ​గురువారం సతీసమేతంగా హాజరయ్యారు. కార్యక్రమాల ఏర్పాట్ల గురించి జీయర్ స్వామిని సీఎం అడిగి తెలుసుకున్నారు. 

తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించి చినజీయర్ స్వామితో కలిసి ప్రదక్షిణ చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించబోయే బంగారు ప్రతిమ ప్రతిష్ట స్థలాన్ని పరిశీలించి, రామానుజాచార్యుల జీవిత చరిత్ర తెలిపే పెయింటింగ్స్ చూశారు. 108 ఆలయాలతో నిర్మించిన దివ్యదేశ టెంపుల్స్ సమూహాన్ని పరిశీలించారు. ప్రవేశద్వార భవనంలో ఏర్పాటు చేసిన ప్రివ్యూ థియేటర్ ను సీఎం ప్రారంభించారు. రామానుజుల జీవిత చరిత్రను తెలిపే షార్ట్​ఫిలింను చూశారు. తర్వాత సీఎం మాట్లాడుతూ.. రామానుజాచార్యులు భక్తి ఉద్యమంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారని, మానవులు అందరూ సమానమని, సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేశారన్నారు. పర్యాటకులకే కాకుండా మానసిక ప్రశాంతత కోరుకునే ప్రతీ ఒక్కరికీ ఈ ప్రాంతం ప్రశాంత నిలయంగా మారుతుందని సీఎం అన్నారు. సమతా మూర్తి విగ్రహ స్థాపన దేశం గర్వించదగిన గొప్ప నిర్మాణమన్నారు. తెలంగాణ వేదికగా వెయ్యేండ్ల తర్వాత ఆ మహామూర్తి బోధనలు మళ్లీ ప్రాచుర్యంలోకి రావడం, మరో వెయ్యేండ్లపాటు ప్రపంచవ్యాప్తం కానుండటం మనందరికీ ఎంతో గర్వకారణమని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

పండ్లు, ప్రసాదం అందిస్తం..

కులాలకు, మతాలకు అతీతంగా విభిన్న సాంస్కృతిక, సాంప్రదాయాలను ఏకతాటిపైన నడిపించే సామాజిక సమతను కొనసాగిస్తామని కేసీఆర్​అన్నారు. అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటోందని చినజీయర్ స్వామికి తెలిపారు. తమ కుటుంబం తరఫున ఉత్సవానికి వచ్చే పండితులు, భక్తుల కోసం ప్రసాదం, పండ్లు అందిస్తామన్నారు. సందర్శనకు వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులను తన కుటీరానికి ఆహ్వానించిన చినజీయర్ స్వామి సహస్రాబ్ది ఉత్సవాల కార్యక్రమాలను వివరించారు. యాగాలు నిర్వహించడానికి తమిళనాడు, కర్నాటక, తిరుపతి నుంచే కాకుండా నేపాల్ తదితర దేశాల నుంచి, దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ క్షేత్రాల నుంచి కూడా వేద పండితులు తరలివస్తున్నారని తెలిపారు. సమారోహానికి తరలివస్తున్న భక్తుల కోసం మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయన్నాయని చినజీయర్ స్వామి ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత సీఎం  రాష్ట్రపతి, ప్రధాని టూర్​ల నేపథ్యంలో భద్రత కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం పరిశీలించారు. ఏర్పాట్ల గురించి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మైహోం అధినేత జూపూడి రామేశ్వరరావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు,  ఏపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 
తదితరులు పాల్గొన్నారు. 

ప్రముఖుల పర్యటన ఇలా..

ముచ్చింతల్​ సందర్శనకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రముఖులు రానున్నారు. ఈ నెల5వ తేదీన పీఎం నరేంద్ర మోడీ, 6న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి,  కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, 8న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, 9న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, 13న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రానున్నారు.