నిజామాబాద్లో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభం

నిజామాబాద్లో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన అనంతరం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్ వద్దకు చేరుకున్న ఆయన భవన సముదాయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.  కలెక్టర్ సి. నారాయణ రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి ప్లవర్ బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్ కు చేరుకున్న సీఎం కేసీఆర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 60 కోట్లు ఖర్చుతో దాదాపు 25 ఎకరాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో మొత్తం 36 ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి.

అంతకు ముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో కొత్తగా నిర్మించిన పార్టీ ఆఫీసును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ ఆఫీసులో కేసీఆర్ ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. అంతకు ముందు పార్టీ కార్యాలయ ప్రాంగణంలో సీఎం మొక్క నాటారు.