
తెలంగాణ నీటిపారుదల రంగంలో కీలకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు పలుకుతూ ముంబైలో బిజీగా గడిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వాన పత్రిక అందించారు.
ఈ మధ్యాహ్నం ముంబైలోని వర్షలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫడ్నవీస్ ను కేసీఆర్ కలిశారు. కేసీఆర్ ను సాదరంగా ఆహ్వానించారు ఫడ్నవీస్. తనతోపాటు ముంబైకి వచ్చిన నాయకులను సీఎం ఫడ్నవీస్ కు పరిచయం చేశారు కేసీఆర్. సమావేశంలో పాల్గొన్న మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ దత్తాత్రేయ మహాజన్ ను కేసీఆర్ కు పరిచయం చేశారు ఫడ్నవీస్. మహారాష్ట్ర సహకారంతోనే ప్రాజెక్టును అనుకున్నట్టుగా నిర్మించగలిగామని కేసీఆర్ .. ఫడ్నవీస్ కు థాంక్స్ చెప్పారు.
అంతకుముందు రాజ్ భవన్ లో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వాన పత్రిక అందజేశారు.